టీజీ ఆర్‌జేసీ పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

టీజీ ఆర్‌జేసీ పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

ఖమ్మంక్రైం: టీజీ ఆర్‌జేసీ ప్రవేశపరీక్ష ఆది వారం జరగనుండగా, పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్‌ 163 ద్వారా ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ తెలిపారు. కేంద్రాల వద్ద ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు 200 మీటర్ల దూరం మేర ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని.. సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులను అనుమతించబోమని వెల్లడించారు. అంతేకాక సమీపంలోని ఇంటర్నెట్‌, జిరాక్స్‌ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు. అలాగే, కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయడంతో పాటు ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా సిబ్బందిని ఏర్పాటుచేస్తున్నట్లు సీపీ తెలిపారు.

సబ్‌ కలెక్టరేట్‌లోనూ గ్రీవెన్స్‌

కల్లూరు: కల్లూరులోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఇక నుంచి ప్రతీ సోమవారం గ్రీవెన్స్‌ డే (ప్రజావాణి) నిర్వహించనున్నట్లు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఈమేరకు డివిజన్‌ స్థాయిలోని ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు, దరఖాస్తులు ఇవ్వొచ్చని వెల్లడించారు. అన్నిశాఖల డివిజన్‌ స్థాయి అధికారులు ఈ కా ర్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు.

కలెక్టరేట్‌లో

రేపటి ప్రజావాణి రద్దు

ఖమ్మం సహకారనగర్‌: జిల్లా కేంద్రంలో ఈనెల 4వ తేదీ సోమవారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నందున కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజావాణిని రద్దు చేశారు. అధికార యంత్రాంగమంతా జాబ్‌మేళా నిర్వహణలో పాలుపంచుకోవాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ దివాకర టీఎస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.

ప్రిన్సిపల్‌ జూనియర్‌

సివిల్‌ జడ్జిగా జ్యోతిర్మయి

ఖమ్మం లీగల్‌: ఖమ్మం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా కాకుమాని జ్యోతిర్మయి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా వేములవాడ కోర్టు నుంచి ఆమె ఖమ్మం బదిలీ అయ్యారు. ఈమేరకు శనివారం ఒకటో అదనపు మెజిస్ట్రేట్‌ రజనీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కాగా, రైతు కుటుంబానికి చెందిన జ్యోతిర్మయి తిరుపతి మహిళా యూనివర్సిటీ నుంచి 2010 లో లా పట్టా పొందారు. 2010లో కావలి కోర్టులో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయిన ఆమె, 2021లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. తొలుత నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో పోస్టింగ్‌ రాగా, ఆపై వేములవాడలో పనిచేశాక ఖమ్మం బదిలీ అయ్యారు.

ఒక ఏఈ.. రెండు చోట్ల యాప్‌లో నమోదు

క్షేత్రస్థాయికి వెళ్లలేదని సస్పెన్షన్‌

నేలకొండపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని దశల వారీగా పరిశీలించాల్సిన ఓ ఏఈ క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఇతరులతో పనిచేయించాడు. అదే సమయా న ఏఈ ఇంకో గ్రామంలో వివరాలు నమోదు చేశా డు. ఏకకాలంలో ఒకే మండల వివరాలు నమోదు కావడంతో అధికారులు ఆయనపై ససెన్షన్‌ వేటు వేశారు. నేలకొండపల్లి గృహ నిర్మాణ శాఖ ఏఈ లింగా తన పరిధిలోని ఓ గ్రామంలో ఇంటి నిర్మాణ వివరాలను పంచాయతీ కార్యదర్శితో యాప్‌లో నమోదు చేయించాడు. అదే సమయాన ఏఈ ఇంకో గ్రామంలో ఇంటి వివరాలు అప్‌లోడ్‌ చేశాడు. దీంతో ఉన్నతాధికారులు ఆరా తీయగా ఏఈ క్షేత్రస్థాయికి వెళ్లలేదని తేలింది. దీంతో ఏఈ లింగాను సస్పెండ్‌ చేస్తూ గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో యాకేష్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించినట్లు ఈఈ శ్రీనివాస్‌ తెలిపారు.

ఎంఈఓ వేతనంలో కోత

విధుల్లో నిర్లక్ష్యంపై అదనపు కలెక్టర్‌ ఆగ్రహం

ముదిగొండ: మండలంలోని రాఘవాపురంభవిత కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ శనివారం పరిశీలించారు. కేంద్రం మరమ్మతులకు నాలుగు నెలల క్రితం రూ.3 లక్షలు మంజూరైనా ఇప్పటివరకు పనులు పూర్తికాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణలో ఎంఈఓ రమణయ్య లోపం ఉందని భావిస్తూ ఆయనకు పది రోజుల వేతనం కోత విధించాలని సీఎంఓ ప్రవీణ్‌ను ఆదేశించారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఉపసర్పంచ్‌ సీహెచ్‌.పార్వతి, వార్డు సభ్యులు మెట్టెల సతీశ్‌, రమాదేవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement