● ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ● మంత్రి పొంగులేటితో కలిసి ఆస్పత్రుల ప్రారంభం ● సబ్‌స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన
సత్తుపల్లి/కల్లూరు: తెలంగాణలో పుట్టడం అదృష్టమని భావించేలా, ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా చిత్తశుద్ధితో పని చేస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని తెలిపారు. సత్తుపల్లిలో రూ.34 కోట్ల వ్యయంతో నిర్మించిన వంద పడకల ఆస్పత్రి, కల్లూరులో రూ.10.50 కోట్ల తో నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భట్టి ప్రారంభించారు. అంతేకాక సత్తుపల్లి మండలం రేజర్ల, కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి కుటుంబీకులు విరాళంగా ఇచ్చిన స్థలంలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో భట్టి మాట్లాడుతూ ప్రతీ పేదవాడికి వైద్యం అందేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేసి ఇదే విద్యా, వైద్యంపై దృష్టి సారించామని తెలిపారు. సత్తుపల్లి, మధిర, అశ్వారావుపేటకు అడ్వాన్స్ టెక్నాల జీ సెంటర్లు మంజూరు చేశామని వెల్లడించారు.
వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ
దివంగత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే గత ప్రభుత్వం చిత్తశుద్ధి లేని కారణంగా నిరుపేదలు ఇబ్బంది పడ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచామన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలల భవనాలను పూర్తిచేయగా, సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి ఆస్పత్రుల్లో వైద్యులను నియమించనున్నామని తెలిపారు. ఆతర్వాత ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆస్పత్రి భవనాలను మొండిగోడలతో వదిలేస్తే తాము వచ్చాక పూర్తిచేశామని తెలిపారు. ఈమేరకు సత్తుపల్లి ఆస్పత్రిలో సింగరేణి సహకారంతో సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ ఏర్పాటు చేయాలని కోరారు. ఈకార్యక్రమాల్లో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, ఆదినారాయణ, గిడ్డంగులు, హస్తకళల సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, సత్యనారాయణ, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర, డీసీహెచ్‌ఓ రాజేందర్‌గౌడ్, ఎస్‌ఈ శ్రీనివాసాచారి, వైద్యాధికారులు రమేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎం.డీ. రెహానాబేగం, వైస్ చైర్‌పర్సన్ బొంతు సుమలత, మార్కెట్ చైర్మన్లు దోమ ఆనంద్‌బాబు, బాగం నీరజాచౌదరితో పాటు భీమిరెడ్డి అరుణ, సుబ్బారెడ్డి, గాదె చెన్నారావు, చల్లగుళ్ల నర్సింహారావు, ఎం. డీ.కమల్‌పాషా, నారాయణవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


