నేడు నృసింహస్వామి గిరి ప్రదక్షిణ
ఖమ్మంగాంధీచౌక్: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన ‘స్వాతి’ సందర్భంగా ప్రతీ నెల నిర్వహించే గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో బాగంగా సోమవారం సాయంత్రం 5:30 గంటలకు నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(గుట్ట) చుట్టూ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ధనుర్మాస ఉత్సవాల నేపథ్యంలో ఉదయం స్వామి వారికి శ్రీ పుష్పయాగం చేస్తారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తులను కొండపై నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి గిరి ప్రదక్షిణ గావిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు కొండపై ఉన్న ప్రత్యేక వేదికపై భక్తుల కరతాళ ధ్వనుల మధ్య అర్చకులు స్వాతి నక్షత్ర జ్యోతిని వెలిగిస్తారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్మోహన్ రావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
నేడు ఉమ్మడి జిల్లాలో పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్ : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయిప్రభాత్ నగర్‌లో పర్యటించనున్నారు. 2.15 గంటలకు భద్రాద్రి జిల్లా చండ్రుగొండ, 3.40 గంటలకు కొత్తగూడెంలో పర్యటిస్తారు. సాయంత్రం 5 గంటలకు డీసీసీ అధ్యక్షురాలు దేవీప్రసన్న ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. 5.45 గంటలకు పాల్వంచ, 6.45 గంటలకు కొత్తగూడెంలో పర్యటిస్తారు. రాత్రి 9.30 గంటలకు కల్లూరు మండలం నారాయణపురంలోని తన నివాసానికి చేరుకుంటారు.
ప్రశాంతంగా టెట్
ఖమ్మం సహకారనగర్ : టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఆదివారం రెండు సెషన్లలో ప్రశాంతంగా జరిగింది. మొదటి సెషన్‌లో 1,070 మందికి గాను 949 మంది, మధ్యాహ్నం సెషన్ పరీక్షకు 1,264 మందికి గాను 1,027 మంది అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ చైతన్య జైనీ ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు ‘నూరేళ్ల అరుణ కేతనం’ ఆవిష్కరణ
ఖమ్మంమయూరిసెంటర్ : నూరేళ్ల అరుణ కేతనం కవితా సంకలనాన్ని సోమవారం ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించనున్నారు. ఖమ్మం డీపీఆర్సీ భవనంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, నవచేతన విజ్ఞాన సమితి సభ్యులు బాగం హేమంతరావు, అభ్యుదయ రచయితల సంఘం బాధ్యులు పల్లేరు వీరస్వామి, రాపోలు సుదర్శన్, కేవీఎల్‌తో పాటు జిల్లాకు చెందిన సాధనాల వెంకటస్వామినాయుడు, మువ్వా శ్రీనివాసరావు, లెనిన్ శ్రీనివాస్, రౌతు రవి, కొంపెల్లి రామయ్య, గోపిశెట్టి వెంకటేశ్వరరావు, రవిమారుత్, సీతారాం, ప్రసేన్, ఐ.వి. రమణారావు తదితరులు హాజరు కానున్నారని నిర్వాహకులు వెల్లడించారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈ కవితా సంకలనాన్ని రూపొందించామని పేర్కొన్నారు.
‘వనజీవి’ స్ఫూర్తితో
మొక్కలు నాటాలి
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఖమ్మంరూరల్: ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వనజీవి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నిర్మిస్తున్న బయోపిక్‌లో భాగంగా హైదరాబాద్ ముచ్చింతల్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వనజీవి పాత్రధారిగా నటిస్తున్న బ్రహ్మాజీతో కలిసి మొక్క నాటారు. అనంతరం మాట్లాడుతూ సామాజిక చైతన్యం కలిగించే మంచి కార్యక్రమాల వైపు ప్రజలను మళ్లించే సినిమాలు నేటి తరానికి ఎంతో అవసరమని తెలిపారు. అలాంటి సినిమా కేవలం వినోదమో, సరదానో కాకుండా విజ్ఞానాన్ని, సమాజానికి మంది సందేశం అందించేలా ఉండాలన్నారు. వనజీవి రామయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సినిమా తీయడం అభినందనీయమని తెలిపారు.


