అభివృద్ధిలో ఖమ్మం ముందంజ
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
ఖమ్మం అర్బన్: నివాసయోగ్య నగరంగా రాష్ట్రంలోనే ఖమ్మం ముందు వరుసలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని 54వ డివిజన్‌లో నిర్మించిన ఎన్టీఆర్ పార్క్‌ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పార్కును మెరుగైన నిర్వహణతో పాటు సీసీ కెమెరాలు, గ్రాస్ కార్పెట్ వంటి అదనపు సౌకర్యాలతో మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. రోడ్లను ఆక్రమించకుండా ప్రజలు సహకరించాలని, పేదలకు గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రోడ్ల విస్తరణతో తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధితో పాటు వ్యాపారాలు మెరుగుపడతాయని తెలిపారు. రోడ్ల విస్తరణలో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. జాతీయ రహదారులు ఖమ్మం మీదుగా వెళ్తున్నాయని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గిస్తూ ఖమ్మాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగర జనాభా ఐదు లక్షలకు చేరిందని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీరు, డ్రెయిన్లు, రోడ్లు, పేదలకు ఇళ్లు వంటి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ రూ.93.70 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ పార్క్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లలో ఫుట్‌పాత్‌లు, పార్కుల నిర్మాణం సహా అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంత రావు, కార్పొరేటర్లు మిక్కిలినేని మంజుల నరేంద్ర, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, డీఈ ధరణికుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, సాధు రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.


