
కోర్టు భవన నిర్మాణానికి భూమిపూజ
మధిర: మధిరలో రూ.24 కోట్ల నిధులతో నిర్మించే కోర్టు భవన సముదాయానికి గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ భూమి పూజ చేశారు. మధిర సీనియర్, జూనియర్ సివిల్ కోర్టుల న్యాయమూర్తులు ఎన్.ప్రశాంతి, వేముల దీప్తితో కలిసి శంకుస్థాపన చేశాక ఆయన నిర్వహణలో ఉన్న కోర్టు రికార్డు రూంను పరిశీలించారు. అలాగే, నూతన భవన నిర్మాణంపై ఇంజనీరింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. తొలుత జిల్లా జడ్జికి న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు స్వాగతం పలికి సత్కరించారు. మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోజడ్ల పుల్లారావు, న్యాయవాదులు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, కట్టా పూర్ణచందర్‌రావు, దేవరపల్లి సుబ్రహ్మణ్యం, గంధం శ్రీనివాసరావు, జింకల రమేష్, సుంకు మోహన్‌దాస్, వెంకట్రావు, కోట జ్ఞానేష్, సంధ్య, మాధురి, సునీత, సూపరింటెండెంట్లు నాగమణి, వెంకన్న, మల్లేశ్వరరావు, మధిర టౌన్ సీఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి మార్కెట్‌కు సెలవులు
ఖమ్మంవ్యవసాయం: పండుగలు, వారాంతం నేపథ్యాన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం నుంచి ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు. ఈనెల 8న శుక్రవారం వరలక్ష్మి వ్రతం, శనివారం రాఖీ పౌర్ణమి, వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తిరిగి సోమవారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు మొదలవుతాయని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
కల్లూరురూరల్: ఆయిల్‌పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడమే కాక రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోందని జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఎం.వీ.మధుసూదన్ తెలిపారు. కల్లూరు మండలం దారుగ బంజరులో ఆయిల్‌పామ్ తోటలు, మిర్చి నర్సరీలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీల్లో మొక్కల పెంపకం, రికార్డుల నిర్వహణపై సూచనలు చేసిన మధుసూదన్ మాట్లాడారు. జిల్లాలో 34వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుండగా, మరో 14,500 ఎకరాల్లో తోటల సాగును లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఎకరాకు సాగు ఖర్చుల కింద నాలుగేళ్లలో రూ.50వేలు, రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ఇస్తున్నండగా.. అంతర పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు. ఇదే సమయాన సంప్రదాయ పంటలతో నష్టాలు వస్తున్నందున రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలని సూచించారు.
11న యూత్ ఫెస్ట్, పరుగు పందెం
ఖమ్మంవైద్యవిభాగం: రెడ్ రిబ్బన్ క్లబ్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌వైకేతో పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యాన హెచ్‌ఐవీ, ఎయిడ్స్ యూత్ ఫెస్ట్‌లో భాగంగా ఈనెల 11న పరుగు పందెం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అదనపు డీఎంహెచ్‌ఓ పి.వెంకటరమణ వెల్లడించారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈనెల 11వ తేదీన ఉదయం 7–30 గంటలకు మొదలయ్యే పరుగు పందెంలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు కళాశాలకు ఇద్దరు చొప్పున పాల్గొనాలని సూచించారు. పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. వివరాలకు 79899 99788(ఎస్.రామకృష్ణ), 91771 03193(వీరయ్య) నంబర్లలో సంప్రదించాలని వెంకటరమణ సూచించారు.
సెలవులో డీఈఓ
ఖమ్మం సహకారనగర్: జిల్లా విద్యాశాఖాధికారి(ఎఫ్‌ఏసీ) కె.నాగపద్మజ మూడు రోజులు సెలవులో వెళ్లారు. ఆమె స్థానంలో డీఈఓ కార్యాలయ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీప్రసాద్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. తిరిగి నాగపద్మజ సోమవారం విధుల్లోకి చేరతారు. ఇదిలా ఉండగా సీఎంఓగా ప్రవీణ్‌కుమార్, ఏఎంఓగా రాజశేఖర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

కోర్టు భవన నిర్మాణానికి భూమిపూజ