ఆ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం..
ఖమ్మంమామిళ్లగూడెం: వక్ఫ్ సవరణ చట్టం–2025 రాజ్యాంగ వ్యతిరేకమని, దేశంలో మరో విభజనకు బీజేపీ కుట్ర పన్నుతోందని, సంఘటిత ఉద్యమాల ద్వారానే దీనిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా ఖమ్మం యూనిట్ ఆధ్వర్యంలో మహ్మద్ అసద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా జమాతే ఇస్లామి హింద్ నాయకులు మహ్మద్ సాధిక్ మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే ఊపిరి అని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు ప్రణాళికాయుతమైన కార్యాచరణ తలపెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సీపీఐ జాతీయ నాయకులు బాగం హేమంతరావు మాట్లాడుతూ.. ఈ చట్టంతో బీజేపీ మత కలహాలను రెచ్చగొట్టాలని చూస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ జగదీశ్, కాంగ్రెస్ నేత, మస్జిద్ ఏ ఆయేషా (సదర్) ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ రషీద్, ప్రజాపంథా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర నాయకులు ఎం.సుబ్బారావు, తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ కేవీ కృష్ణారావు, పీడీఎస్‌యూ నాయకులు ఆజాద్, ఖమర్, డాక్టర్ గోపీనాథ్ పాల్గొన్నారు.
వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లింలకు మేలు
ఖమ్మంమామిళ్లగూడెం: వక్ఫ్ సవరణ చట్టం అమలుతో పేద ముస్లింలు, మైనార్టీ మహిళలకు మేలు చేకూరుతుందని, పాత వక్ఫ్ బోర్డు అమలు అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడమేనని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌గౌడ్, హైకోర్టు న్యాయవాది, బీజేపీ రాష్ట్ర నాయకులు సుంకర మౌనిక విమర్శించారు. వక్ఫ్ చట్ట సవరణ చట్టం 2025 జన జాగరణ అభియాన్ పేరుతో ఖమ్మంలోని హోటల్ మినార్ గ్రాండ్‌లో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహించారు. తొలుత ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీ తమిళనాడు, కర్ణాటక సహ ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం వల్ల ముస్లిం మైనార్టీలకు ఒనగూరే ఉపయోగాలు, పకడ్బందీగా అమలు కాకపోతే వచ్చే నష్టాల గురించి ఫోన్ ద్వారా తెలిపారు. నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు ముస్లిం మైనార్టీలను భయాందోళనలకు గురిచేస్తూ దేశాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వక్ఫ్ బోర్డు వల్ల ముస్లింలకు అన్యాయం తప్ప ఉపయోగం ఏమాత్రమూ లేదన్నారు. కార్యక్రమంలో నున్నా రవికుమార్, నంబూరి రామలింగేశ్వరరావు, విజయరాజు, ఈవీ రమేశ్, వీరవెల్లి రాజేశ్‌గుప్తా, కొలిపాక శ్రీదేవి, ఎస్‌కే యాకూబ్‌పాషా, పమ్మి అనిత తదితరులు పాల్గొన్నారు.
పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు


