పనులు అంతంత మాత్రమే..
● ‘ఉపాధి’ కల్పనపై దృష్టి సారించని అధికారులు ● గతేడాదితో పోలిస్తే సగం మందికీ దక్కని కూలీ ● జిల్లా నుంచి 53.15 లక్షల పనిదినాలు ప్రతిపాదన.. ● 30.76 లక్షల పనిదినాలకే కేంద్ర లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: వ్యవసాయ సీజన్ చివరకు చేరడంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర పనులు తగ్గిపోతున్నాయి. ఈనేపథ్యాన కూలీలకు ఉపాధి హామీ పథకం వరంలా అండగా నిలవాలి. తద్వారా కూలీలకు ఉపాధి లభించి ఆర్థికంగా ఆసరా అవుతుంది. ఈక్రమంలోనే జిల్లాలో కొన్నేళ్ల క్రితం వరకు ఉపాధి కూలీలకు వెళ్లే వారి సంఖ్య లక్షల్లోనే ఉండగా.. ఏప్రిల్ నెల మొదటి వారం నుండే జాతరలా పనులు సాగేవి. కానీ ఈ ఏడాది మాత్రం కూలీలకు పనుల కల్పన నామమాత్రంగానే ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఏప్రిల్ సగం మేర గడిచినిపోయినా కనీస పనిదినాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని చెబుతున్నారు.
తగ్గిన పనిదినాలు
ఏటా ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య ఆధారంగా అధికారులు ఈ ఏడాది ఎన్ని పనిదినాలు అవసరమో ప్రణాళిక రూపొందిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జిల్లాలో 53.15లక్షల పనిదినాలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన వాటా ప్రకారం జిల్లాకు 30.76 లక్షల పనిదినాలనే లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం యూనిట్‌గా పనిదినాల సంఖ్య పెంచితే అదే స్థాయిలో జిల్లాకూ లబ్ధి జరగనుంది.
పనుల కల్పనలో అలసత్వం
జిల్లాలో కూలీలకు ఉపాధి పనుల కల్పనపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్‌లో పనులకు వచ్చే కూలీల సంఖ్య తక్కువగా ఉండడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గతేడాది ఏప్రిల్ 11వ తేదీన 40,836 మంది కూలీలకు పని చూపించగా.. ఈ ఏడాది 11న 28,410 మందికే పనులు కల్పించడం గమనార్హం. ఇక గతేడాది ఏప్రిల్ 12న 80,734 మంది హాజరైతే, ఈ ఏప్రిల్ 12న 19,094 మంది మాత్రమే పనులకు హాజరయ్యారు. కాగా, ఏప్రిల్‌లో 9,96,307 పని దినాలు కల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1.35 లక్షల పని దినాలు కల్పించడంతో కూలీలకు నష్టం ఎదురవుతోంది. గ్రామాల్లో రోజుకు 60వేల మందికి సరిపడా పనులు ఉన్నా అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదని తెలుస్తోంది.
జిల్లాలో జాబ్‌కార్డులు, కూలీల వివరాలు
జాబ్ కార్డులు 3.06 లక్షలు
కూలీలు 6.43 లక్షలు
యాక్టివ్ జాబ్‌కార్డులు 1.83 లక్షలు
యాక్టివ్ కూలీలు 3.08 లక్షలు


