
నేలకొండపల్లి రామదాసు మందిరంలోని ఉత్సవ మూర్తులు
నేలకొండపల్లి: పరమ భక్తాగ్రేసరుడు కంచర్ల గోపన్న(భక్త రామదాసు) జన్మస్థలమైన నేలకొండపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 17న శ్రీసీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆలయాన్ని భద్రాచలం దేవస్థానం దత్తత తీసుకోగా.. శనివారం అధికారులు మందిరం అర్చకుడు సౌమిత్రి రమేష్‌కు పట్టు వస్త్రాలు, తలంబ్రాలను అందజేశారు. అలాగే, కల్యాణోత్సవం నిర్వహణకు రూ.50వేల వరకు నిధులు కేటాయించినట్లు తెలిసింది. ఇక కల్యాణం నిర్వహించేందుకు భద్రాచలం దేవస్థానం నుంచి నలుగురు వేదపండితులు రానుండగా, స్థానిక భక్తులు గోటి తలంబ్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు.
రేపటి నుంచి
ఫ్యాక్టరీలో క్రషింగ్
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీలో సోమవారం నుండి గెలల క్రషింగ్ పునఃప్రారంభం కానుంది. ఈ విషయన్ని ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. వార్షిక మరమ్మత్తుల కారణంగా నెల క్రితం అప్పారావుపేట ఫ్యాక్టరీకి సెలవు ప్రకటించారు. ప్రస్తుతం పనులు పూర్తికావడంతో ఈనెల 15వ తేదీ నుంచి గెలలు స్వీకరిస్తామని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని ఆయన కోరారు.
అశ్వారావుపేట
ఫ్యాక్టరీలో బ్రేక్
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేటలోని అయిల్‌పామ్ ఫ్యాక్టరీలో ఈనెల 15వ తేదీ నుంచి గెలల క్రషింగ్ నిలిపేస్తున్నట్లు ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, ఫ్యాక్టరీ మేనేజర్ ఆకుల బాలకృష్ణ తెలిపారు. ఫ్యాక్టరీ నిర్వహణ పనులు చేపట్టనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు దమ్మపేట మండలం అప్పారావుపేట ఫ్యాక్టరీకి గెలలను తరలించాలని కోరారు. కాగా, గెలల దిగుబడి సమయాన నిర్వహణ పనుల పేరుతో క్రషింగ్ నిలిపివేయడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.