మైసూరు: మైసూరు సంస్థానాన్ని పాలించిన మహారాజ నాల్వడి కృష్ణరాజ ఒడెయర్ చేసిన శాశ్వత అభివృద్ధి పనులతో కన్నడనాడులో అభివృద్ధి ఇనుమడించిందని ఎమ్మెల్యే టీఎస్ శ్రీవత్స అన్నారు. నగరంలోని జేఎల్‌బీ రోడ్డులోని నాదబ్రహ్మ సభాంగణంలో పాతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాల్వడి 142వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. నాల్వడి మహారాజుగా ఉన్న కాలంలో నిర్మించిన పాఠశాలలు, కాలేజీలు, ఆస్పత్రులు, ఆనకట్టలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సాధకులు డాక్టర్ చంద్రశేఖర్(యోగా, వైద్య రంగం), యోగా ప్రకాష్ (యోగా), సీమా(యోగా), డాక్టర్ పీఎం గణేష్ కుమార్ (క్రీడలు), ఎస్‌వీ వెంకటేశయ్య (యోగా), డాక్టర్ కావ్య ఎస్(వైద్య), లయన్ కేఎన్ సురేష్ (ధార్మిక రంగం), సుమ రాజ్‌కుమార్‌లను సన్మానించారు.
బాలలనూ వదలరా?
● హైకోర్టు విస్మయం
దొడ్డబళ్లాపురం: ఏమిటీ.. బాలలకూ రక్షణ లేదా? వారినీ వదలడం లేదా? అంటూ హైకోర్టు ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలలను వేధించిన పోక్సో కేసులో వచనానందస్వామికి దావణగెరె జిల్లా కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని ప్రశ్నిస్తూ పోలీసులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. స్వామీజీ తమ మఠంలోని బాలలను లైంగికంగా వేధించారనే అభియోగాలపై జడ్జి విస్మయం వ్యక్తం చేస్తూ బాలలకు భద్రత కరువైందా? అని ప్రశ్నించారు. ఇలాంటి కేసులో ముందస్తు బెయిలు ఇవ్వడం ఏ మాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. సాధారణ బెయిలు కోసం ప్రయత్నించవచ్చని సూచిస్తూ విచారణను వాయిదా వేశారు.
పరమేశ్వరా.. వర్షించు
శివమొగ్గ: శివమొగ్గ జిల్లా అంటే వానలకు కొదవ ఉండదు. కానీ ఈసారి తొలకరి వర్షాలు ఆలస్యమయ్యాయి. వేసవి ఎండలు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడక్కడ కరువు ఛాయలు సైతం అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం కోసం దేవునిపై భారం వేస్తున్నారు. సోమవారం సాయంత్రం శివమొగ్గలోని ఓంశక్తి బడావణె సమీపంలోని పురాతన శివాలయంలో వీరశైవ సమాజ సీనియర్ నాయకుడు ఉమేష్ హిరేమఠ నేతృత్వంలో పూజలు నిర్వహించారు. తొలకరి వర్షాలు రావడం లేదని, జీవకోటి ఇబ్బందులు పడుతోందని తెలిపారు. అందువల్ల మంచి వర్షాల కోసం పరమేశ్వరున్ని ప్రార్థించామన్నారు.
నాన్‌వెజ్ కోతిపై ఫిర్యాదు
యశవంతపుర: సాధారణంగా కోతులు పండ్లు, కూరగాయలు వంటి శాకాహారాన్ని భుజిస్తాయి. కానీ ఓ వానరానికి మాంసంపై మనసు పడింది. ఇంట్లోకి దూరి చికెన్, మటన్ వంటకాలను ఎత్తుకెళ్తోంది. రేవునగరి మంగళూరులో మణ్ణగుడ్డె ప్రాంతంలో ఇది జరుగుతోంది. ఓ ఇంటివారు వండుకున్న మాంసం, చేపల కూరను దొంగిలిస్తోంది. నాన్ వెజ్‌ను ఇష్టపడే ఈ కోతి చేష్టలను తట్టుకోలేక బాధితుడు కాంత్‌రాజ్ అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెండేళ్ల నుంచి ఈ కోతి తమ ఇంటిలోకి దూరి మాంసం వంటకాలను దొంగిలించి తింటోందంటూ, దాని బారి నుంచి కాపాడాలని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.


