● ఆట మైదానంగా నది
యశవంతపుర: కాఫీనాడు చిక్కమగళూరులో ఈసారి ముంగారు వానలు అంతంత మాత్రంగా పడుతున్నాయి. 30 ఏళ్ల తరువాత మొదటిసారిగా భద్రా నదీ వానలు లేక ఎండిపోవటం జిల్లావాసులకు దిగులు కలిగిస్తోంది. జూన్ నెలలో మంచి వానలు పడి నదీ ప్రవాహం జోరుగా ఉంటుంది, అందుకు భిన్నంగా ఎక్కడ చూసినా ఎండిపోయి ఇసుక కనిపిస్తోంది. కళస తాలూకా కుదురేముఖ్ పర్వతశ్రేణిలో పుట్టి జిల్లాను సస్యశ్యామలం చేసే నదుల్లో భద్రా ఒకటి. ప్రకృతి ఆగ్రహమో, ఏమోకానీ వర్షాలు లేక నది బోసిపోతోంది. బాళెహొన్నూరు వద్ద బీడుగా మారింది. గత 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదని ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిండుగా పారేటప్పుడు నది లోతు ఎంతో తెలియని వ్యక్తులు ఇప్పుడు లోతును లెక్కిస్తున్నారు. నదిలో ఉంటున్న రాళ్లు, గుండ్లు బయటపడుతున్నాయి. వాలీబాల్, క్రికెట్ ఆడే పిల్లలకు ఆట మైదానంలా మారింది.


