బొమ్మనహళ్లి: బెంగళూరుకు చెందిన భక్తులు ఉడుపి జిల్లా కుందాపురలో వెలసిన ప్రసిద్ధ కొల్లూరు మూకాంబికా దేవి అమ్మవారికి వెండి రథం బహూకరించారు. ఆ రథంతో ఆదివారం రాత్రి తేరు వేడుకను నిర్వహించారు. వేద పండితులు రథానికి విశేష పూజలు జరిపారు. ఈ రథాన్ని 106 కిలోల వెండితో తయారు చేశారు. అంచనా వ్యయం రూ 3 కోట్లు.
విస్ఫోటంలో కుక్క మృతి
దొడ్డబళ్లాపురం: రోడ్డుమీద పడిఉన్న కవర్‌ను కొరికిన పెంపుడు కుక్క పేలుడు సంభవించి మృత్యువాత పడింది. ఈ ఘటన దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా నల్కుదరె గ్రామంలో జరిగింది. రుద్రేశ్ పెంపుడు కుక్కతో కలిసి పశువులు మేపడానికి వెళుతుండగా కుక్క రోడ్డుపక్కన పడి ఉన్న ప్లాస్టిక్ కవర్‌ను కొరికింది. వెంటనే పేలుడు జరిగి కుక్క చనిపోయింది. పేలుడు శబ్దం కిలోమీటర్ దూరం ఉన్న గ్రామానికి వినబడింది. సంతెబెన్నూరు పోలీసులు పరిశీలించి పేలుడు అవశేషాలను ల్యాబ్‌కు తరలించారు. ఎవరైనా అడవి పందులను వేటాడేందుకు తీసుకొచ్చిన పేలుడు సామగ్రిని పారేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
రూ.2 కోట్ల గంజాయి సీజ్
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో కెంపేగౌడ విమానాశ్రయంలో రూ.2.09 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుని కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అతని లగేజీని చెక్ చేయగా 5.9 కేజీల హై.గంజాయి దొరికింది. దీని విలువ రూ.2.09 కోట్లుగా తెలిపారు. అతనిపై డ్రగ్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
పాలపై దుష్ప్రచారం చేస్తారా, కేసు తప్పదు
● వైద్యురాలికి హైకోర్టు మందలింపు
యశవంతపుర: ‘నీకు పాలు ఇష్టం లేకుంటే తాగడం మానేయాలి. కానీ ఇలా రీల్స్ చేసి పోస్టు చేయడం తప్పు’ అని ఓ మహిళా వైద్యురాలికి హైకోర్టు అక్షింతలు వేసింది. వివరాలు కేఎంఎఫ్ నందిని పాలు విషపూరితమంటూ వైద్యురాలు డాక్టర్ శరణ్య పద్మాపై బెంగళూరు మల్లేశ్వరం పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం కేసు విచారణ సాగింది. ఆ పాలు విషపూరితం అంటూ ఎలా చెప్పగలరని హైకోర్టు జడ్జి ప్రశ్నించారు. ఇలా రీల్స్ చేసి ప్రజలు, వినియోగదారులను గాభరా పెట్టడం సబబేనా? అని అడిగారు. పాలను పరీక్షించి ధృవీకరించుకున్నారా అని ప్రశ్నలు వేశారు. పాలు బాగా లేకుంటే తాగవద్దు, ఇన్‌స్టాలో ఇలాంటి రీల్స్ పోస్టు చేస్తారా? అని జడ్జి మందలించారు. నీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు.
ఏమిటీ గొడవ?
డాక్టర్ శరణ్య పద్మా ఫిబ్రవరి 8న సోషల్ మీడియాలో వీడియో, రీల్స్‌ను పోస్టు చేశారు. నందిని బ్రాండ్ క్రీమ్ బన్, స్ట్రాబెర్రి ఫ్లేవర్ పాలు, పనీర్, ఇతర పదార్థాలు కల్తీగా ఉన్నట్లు చెప్పారు. శరీరానికీ హాని కలిగించే రసాయనాలున్నట్లు ఆమె ఆరోపిస్తూ, వీటిని సేవిస్తే ఆటో–ఇమ్యూన్ వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు. దీంతో ఆమైపె కేఎంఎఫ్ అధికారులు కేసు వేశారు.
రైల్వే పరీక్షను
కన్నడలో జరపాలి
తుమకూరు: రైల్వే శాఖలో కన్నడను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు, ఈ నెల 25వ తేదీన కర్ణాటకలో జరగనున్న నైరుతి రైల్వే గూడ్స్ ట్రైన్ మేనేజర్ ప్రమోషన్ పరీక్షలో కన్నడకు అవకాశం ఇవ్వకుండా, హిందీ, ఇంగ్లిషులో మాత్రమే ప్రశ్నాపత్రాలు ఇస్తారా, రైల్వే శాఖ కన్నడ ప్రజలకు ద్రోహం చేస్తోంది అని కర్ణాటక రక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు అరుణ్ కృష్ణయ్య అన్నారు. సోమవారం నగరంలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయాన్ని రైల్వే శాఖ సహాయ మంత్రి, తుమకూరు ఎంపీ వి.సోమన్న దృష్టికి తీసుకువచ్చినప్పటికీ, ఆయన సమర్థించుకోవడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఎంతమంది ఎంపీలు, మంత్రులు అభ్యంతరం చెప్పినా కన్నడ వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. ఇది కన్నడిగుల ఉద్యోగ హక్కులు, పదోన్నతి హక్కులు, భాషా ఆత్మగౌరవంపై జరుగుతున్న బహిరంగ దాడి అని ఆరోపించారు. నైరుతి రైల్వేలోని హుబ్బళ్లి, బెంగళూరు, మైసూరు డివిజన్లలో గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టుల కోసం 25వ తేదీన కంప్యూటర్ ఆధారిత ప్రమోషన్ పరీక్షను కన్నడలోనూ నిర్వహించాలన్నారు.


