చింతామణిలో రైతుల ధర్నా
ఆనేకల్ తాలూకా చందాపురలో ఆందోళన
బొమ్మనహళ్లి: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలని సోమవారం బెంగళూరు వద్ద ఆనేకల్ తాలూకాలోని చందాపురలో బెస్కాం ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది, రైతులు నిరసన తెలిపారు. ‘విద్యుత్ రంగ ప్రైవేటీకరణ ధిక్కారం’, ‘టాటా పవర్ కంపెనీ లైసెన్సును నిలిపివేయండి’ అని నినాదాలు చేశారు. బెస్కాం ఒక కంపెనీ కాదు, అది రైతులతో సహా కోట్లాది మంది ప్రజల జీవనాధారం అని కేఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ధనంజయ అన్నారు. రాష్ట్రంలో సుమారు 50 వేల మంది లైసెన్స్‌డ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు ఉన్నారు. 3–4 లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయన్నారు. ప్రైవేటీకరణతో ఎంతోమందికి ఉపాధి పోతుందన్నారు.
ఆత్మహత్యలే దిక్కు
చింతామణి: ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను ప్రవేటీకరిస్తామనడం, పంపుసెట్లకు మీటర్ బిగిస్తామనడం సరికాదని రాష్ట్ర రైతుసంఘం, హసిరు సేనా, బెస్కాం లైసెన్సుడ్ కాంట్రాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం భారీ ఊరేగింపుగా వచ్చి తాలూకా కార్యాలయాన్ని ముట్టడించారు. రైతు సంఘం నాయకులు రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కరువు ఉందని, రైతుల పంటలకు ధర లభించడం లేదన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చితే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటారన్నారు. తహశీల్దార్ సుదర్శన్ యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు.
పలుచోట్ల ఉద్యోగులు, రైతుల నిరసనలు


