సాక్షి,బళ్లారి: దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన భగవాన్ హనుమంతుడి నిజమైన జన్మస్థలం ఎక్కడ అనే విషయాన్ని తేల్చడానికి సంబంధించిన అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు సోమవారం ఈ కేసులో అత్యవసర విచారణ చేయడానికి నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత కేసును పునర్విచారణ చేపట్టే నిర్ణయంపై పిటిషన్‌దారుడు ఆవేదన వ్యక్తం చేసి దాఖలు చేసిన రిట్‌పై విచారణకు అత్యున్నత న్యాయస్థానం మొగ్గు చూపలేదు. న్యాయమూర్తి బీ.వీ.నాగరత్న, న్యాయమూర్తి జే.ఎం.బాగ్చితో కూడిన ద్విసభ్య పీఠం ఎదుట ఈ విషయాన్ని సాధారణ కారణ జాబితా బయట మౌఖికంగా ప్రతిపాదించారు. అయితే ఈ దశలో అభ్యంతరం వ్యక్తం చేయడానికి నిరాకరించిన ధర్మాసనం కర్ణాటక హైకోర్టు తన నిర్ణయాన్ని స్పష్టం చేయడానికి సమర్ధవంతంగా ఉందని పేర్కొంటూ సదరు రిట్‌ను తిరస్కరించారు. సుప్రీంకోర్టు ఎదుట హాజరైన రిట్‌దారుడి తరుపు న్యాయవాది కర్ణాటక హైకోర్టు ముందు అత్యంత అసాధారణంతో పాటు విచిత్ర కార్య విధాన పరిస్థితి నెలకొందని వాదించారు. న్యాయవాదుల ప్రముఖ వాదనల్లో హైకోర్టు ఇప్పటికే ఈ వివాదాన్ని సుదీర్ఘ విచారణ జరిపి తన తీర్పును రిజర్వ్ చేసిందని తెలిపారు.
ఇలా తీర్పు.. అలా పునర్విచారణ..
అనంతరం ఓపెన్ కోర్టులో తీర్పును ప్రకటించి, ఆదేశ ప్రతులను ప్రకటించి సంతకాలు కూడా జరిగాయి. అయితే తీర్పు ప్రకటించిన తక్షణమే ఈ కేసును ఉన్నఫళంగా మరుసటి రోజే తిరిగి విచారణ జాబితాలో చేర్చారు. చట్టప్రకారం ఒకసారి కోర్టు తీర్పు ప్రకటించి సంతకం చేసిన తర్వాత ఆ విషయంపై కోర్టు న్యాయ పరిధి ముగిిసిపోతుంది. దీన్ని న్యాయ పరిభాషలో ఫంక్టస్ అఫిిషియో అంటారు. నిర్ధిష్ట చట్ట రాయితీలను మినహాయించి, అదే కేసును తిరిగి విచారణ చేపట్టడం సాధ్యం కాదు. తీర్పు వచ్చిన తర్వాత పునఃపరిశీలనకు ఎంపిక చేసుకోవడం తీవ్రమైన కార్యవిధాన లోపమని న్యాయవాది తక్షణమే అభ్యంతరం వ్యక్తం చేశారు. రిట్ దారుల వాదనలను ఆలకించిన న్యాయమూర్తి బీ.వీ.నాగరత్న కర్ణాటక హైకోర్టు కార్యవైఖరిని, పద్ధతిని సమర్ధించారు. కర్ణాటక హైకోర్టు తనదైన కార్యవైఖరిని కలిగి ఉందని, అవసరమైతే ఆదేశంలోని కొన్ని అంశాలను స్పష్టీకరించే, అలాగే సవరణ లేదా సరిదిద్దే ప్రక్రియను హైకోర్టు చేపట్టవచ్చు. హైకోర్టు ఈ సమస్యను స్వయంగా నిర్వహించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. సాంకేతికత లేదా చట్టపరమైన అభ్యంతరాలు ఉంటే హైకోర్టు ముందుగా వాటిని పరిగణించాలని పేర్కొనడం ద్వారా సుప్రీంకోర్టు ఎటువంటి తక్షణ పరిష్కారం ఇవ్వడానికి నిరాకరించింది.
హిందూ ధార్మిక సంస్థల మధ్య వివాదం
విశేషమేమిటంటే ఈ హనుమాన్ జన్మభూమి వివాదం రెండు విభిన్న మతాల మధ్య సంక్లిష్టమైన విషయం కాదని, బదులుగా రెండు హిందూ ధార్మిక సంస్థల మధ్య జరుగుతున్న చారిత్రాత్మకమైన, ధార్మిక హక్కుల పోటాపోటీ అని చెప్పవచ్చు. 2021లో ప్రారంభమైన ఈ వివాదంలో ప్రముఖంగా మూడు వాదాలు తెరపైకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తన పరిధిలో తిరుమల గుట్టలు, పర్వతాలలోని అంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామి నిజమైన జన్మస్థానం అని ప్రతిపాదించింది. తన ప్రతిపాదనకు మద్దతు కోసం టీడీడీ ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. పురాణ సాహిత్యం, ప్రాచీన తామ్ర ఫలకాలు, శాసనాలు, అలాగే భౌగోళిక ఆధారాల ప్రాతిపదికన కమిటీ నివేదిక సమర్పించింది. ఆ మేరకు టీటీడీ ఓ చిరు పుస్తకాన్ని ప్రకటించింది. అంతేకాకుండా రామ నవమి రోజున ఆ స్థలాన్ని హనుమంతుడి జన్మస్థలంగా పవిత్రీకరించి అక్కడ పర్యాటక వసతుల అభివృద్ధి చేపట్టింది. కర్ణాటకలో యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రాత్మక, పారంపరికమైన హంపీ దగ్గరలోని కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలో వెలసిన అంజనాద్రి కొండ హనుమంతుడి నిజమైన జన్మస్థలం అని శ్రీ హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు, అలాగే సంస్థాపక స్వామి గోవిందానంద స్వామి సరస్వతి ప్రతిపాదించారు.
ఆధారాలు ఉన్నా ఏకాభిప్రాయం కరువు
వాల్మీకి రామాయణం, స్కంధ పురాణం, వరాహ పురాణం, బ్రహ్మాండ పురాణం వంటి గ్రంథాల ఆధారంగా వైదిక విద్వాంసులు, చరిత్రకారుల కమిటీ ఈ తీర్మానానికి వచ్చింది. నేటి హంపీ, తుంగభద్ర నది చుట్టుపక్కల కిష్కింధ ప్రాంతంలోని అంజనహళ్లే హనుమంతుడి జన్మభూమి అన్నది వీరి వాదం. కొప్పళ జిల్లా అంజనాద్రిలో జన్మించారని ఈ ప్రాంత ప్రజలతో పాటు, దేశ వ్యాప్తంగా ఎందరో భక్తుల నమ్మకంతో పాటు విశ్వాసం. అందుకు సంబంధించి ఎన్నో ఆనవాళ్లు, చరిత్రను తెలియజేసే విషయాలు ఉన్నాయని, రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు ఆమె కోసం వెతికేందుకు శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గంగావతి సమీపంలోని కిష్కింధ సమీపంలో హనుమంతుడిని, సుగ్రీవుడిని తొలిసారిగా కలిశారని కూడా చరిత్ర ఆధారాలు ఉన్నాయని ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే ఇటీవల తిరుమల అంజనాద్రిలో ఆంజనేయ స్వామి జన్మించారని వివాదం తలెత్తడంతో హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై విధ్వాంసుల మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినా ఏకాభిప్రాయం కుదరలేదు.
తెరపైకి ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ కూడా..
ఈ రెండింటి మధ్య కర్ణాటక తీర ప్రాంత జిల్లా ఉత్తర కన్నడలోని గోకర్ణ హనుమంతుడి నిజమైన జన్మస్థలం అని జగద్గురు శంకరాచార్య, శ్రీరామచంద్రాపురం మఠం మూడో వాదాన్ని తెరపైకి తెచ్చింది. వాల్మీకి రామాయణంలో ఉల్లేఖించిన ప్రకారం హనుమంతుడు గోకర్ణలో జన్మించారని, అయితే కిష్కింధ అంజనాద్రి ఆయన ఆ తర్వాత కార్యకలాపాలకు కేంద్రమైనందువల్ల అది హనుమంతుడి కర్మభూమి అని, జన్మభూమి కాదని ఆ మఠం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రస్తుతానికి జోక్యం చేసుకోవడానికి నిరాకరించినందు వల్ల ఈ జటిల ధార్మిక వివాదం న్యాయపోరాటం మళ్లీ తిరిగి కర్ణాటక హైకోర్టులోనే కొనసాగనుంది. హైకోర్టు తన పునర్విచారణ సందర్భంగా ఎటువంటి తీర్మానం చేపట్టనుందో, అలాగే తీర్పు గందరగోళ విషయాలను ఎలా పరిష్కరించనుందో ఆధ్యాత్మిక జిజ్ఞాసులు, ఈ ప్రాంత ప్రజల దృష్టి కేంద్రీకృతమైంది. మొత్తానికి హనుమంతుడి జన్మస్థలం గురించిన చర్చ రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం కానుందని చెప్పవచ్చు.
అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచన


