శాంతియుత మొహర్రం ఆచరణకు పిలుపు | - | Sakshi
Sakshi News home page

శాంతియుత మొహర్రం ఆచరణకు పిలుపు

Jun 23 2026 12:24 AM | Updated on Jun 23 2026 12:24 AM

రాయచూరు రూరల్‌ : గ్రామీణ ప్రాంతాల్లో మొహర్రం పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని రాయచూరు రూరల్‌ ఎస్‌ఐ ప్రకాష్‌ డంబళ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం రాయచూరు తాలూకా కూడ్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మొహర్రం పండుగను శాంతియుతంగా జరుపుకునేందుకు గట్టి పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. హిందూ, ముస్లిం సోదరులు కలిసి చేసుకునే పండుగల్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.

రైల్వే బోర్డు పరీక్షలు కన్నడలో జరపాలి

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలోని నైరుతి రైల్వే డివిజన్‌ పరిధిలో ఈనెల 25న నిర్వహించనున్న రైల్వే బోర్డు పరీక్షలు కన్నడలో నిర్వహించాలని కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు వినోద్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినందున నైరుతి రైల్వే డివిజన్‌లో రైల్వే బోర్డు పరీక్షలు కన్నడలో కాకుండా ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థులకు అనుకూలమయ్యేలా కన్నడ భాషలో పరీక్షలు జరపాలని ఒత్తిడి చేశారు.

తుర్విహాళ్‌ ఎస్‌ఐపై

చర్యలకు డిమాండ్‌

రాయచూరు రూరల్‌: జిల్లాలోని సింధనూరు తాలూకా తుర్విహాళ్‌ ఎ్‌స్‌ఐపై చర్యలు చేపట్టాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. సోమవారం సింధనూరు డీఎస్పీ కార్యాలయం వద్ద న్యాయవాదులు చేపట్టిన ఆందోళనలో వారు మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లకు పరేడ్‌లో తీసుకుంటున్న జాగ్రత్తలో భాగంగా రౌడీ షీటర్‌ సోమనాథ్‌ నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్న అంశంపై ప్రశ్నించిన న్యాయవాది అరళయ్యని అవాచ్య పదజాలంతో దూషించారు. కోపోద్రీక్తుడైన న్యాయవాది తాలూకా న్యాయవాదుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు డీఎస్పీ కార్యాలయం వద్ద ఆకస్మిక ఆందోళన జరిపి తుర్విహాళ్‌ ఎ్‌స్‌ఐ సుజాత డీ.నాయక్‌పై చర్యలు చేపట్టాలని కోరుతూ డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐలు వీరారెడ్డి, వినాయక్‌లకు వినతిపత్రం సమర్పించారు. కోర్టు కార్యకలాపాలను బహిష్కరించి నినాదాలు చేశారు.

మత్తు పదార్థాల కట్టడికి సహకరించండి

రాయచూరు రూరల్‌ : జిల్లాలో మాదక వస్తువుల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పిలుపు ఇచ్చారు. సోమవారం నగరంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో జరిగిన మాదక వ్యసనాల నుంచి విముక్తిపై చేపట్టిన ప్రచారాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. నేటితరం యువత డ్రగ్స్‌కు అలవాటు పడ్డారన్నారు. యువత దురలవాట్లకు గురై ఉజ్జ్వల భభవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. మాదక వస్తువుల సేవనంతో ఆరోగ్యానికి తోడు మానసికంగా కుంగిపోతారన్నారు. సమావేశంలో వడవాటి నరసింహులు, శరణప్ప, ప్రతిభ, వెంకట సింగ్‌లున్నారు.

24న లక్ష్మీ నృసింహునికి పూజలు

కేజీఎఫ్‌ : నగరంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈనెల 24వ తేదీ బుధవారం స్వాతి నక్షత్ర విశేష పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 9 గంటలకు లక్ష్మీనారాయణ హోమం, మహా అభిషేకం, వేదఘోష, మహా మంగళారతి తదితర పూజలను చేస్తున్నారు. పూజల్లో పాల్గొనే భక్తుల కోసం అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. దేవాలయ ధర్మాధికారి మహేంద్రన్‌ నేతృత్వంలో పూజల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి వారి కృపకు పాత్రులు కావాలని దేవాలయ ధర్మాధికారి కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement