సాక్షి,బళ్లారి: జిల్లాలో రౌడీషీటర్ల అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ఉక్కుపాదం మోపి గట్టి చర్యలు తీసుకున్నామని, జిల్లాలో అనుమానితులైన 104 మంది రౌడీషీటర్ల ఇళ్లలో సోదాలు చేసినట్లు బళ్లారి రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) హర్ష పేర్కొన్నారు. ఆయన సోమవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 17 పోలీసు స్టేషన్ల పరిధిలో ఒకేసారి విస్తృతంగా సోదాలు జరిపామన్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో 6 మంది దాకా రౌడీషీటర్ల ఇళ్లను సోదా చేశామన్నారు. తనిఖీల్లో ఏపీఎంసీ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక రౌడీ షీటర్ ఇంట్లో ఎయిర్‌గన్, స్టాంపు పేపర్లు, ప్రామిసరీ నోటీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర జిల్లాల్లో ఏకకాలంలో 22 బృందాలను ఏర్పాటు చేసి 381 మంది రౌడీల ఇళ్లలో సోదాలు చేశారన్నారు. ఆంధ్రాళ్‌లో సీతారాం ఇంట్లో ఎయిర్‌గన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. బళ్లారి జిల్లాలో 104, విజయనగరలో 106, రాయచూరులో 103, కొప్పళ జిల్లాలో 68తో కలిని మొత్తం 381 మంది రౌడీల ఇళ్లలో సోదాలు చేపట్టామన్నారు. ఆయా ఇళ్లలో వాహనాలు, ఇతరత్రా వాటిని పరిశీలించారన్నారు. కొందరు రౌడీషీటర్లు మృతి చెందారన్నారు.
నాలుగు జిల్లాల్లో ప్రత్యేక నిఘా
నాలుగు జిల్లాల్లో 3,814 మందిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. బళ్లారి జిల్లాలో 53 మందిని సరిహద్దులు దాటించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. వీరిలో 10 మందిని ఇప్పటికే సరిహద్దులు దాటించారన్నారు. ప్రముఖంగా హత్యారోపణలు ఎదుర్కొంటున్న 377 మందిలో బళ్లారి జిల్లాలో 126 మంది, విజయనగర జిల్లాలో 71 మంది, రాయచూరు జిల్లాలో 100 మంది, కొప్పళ జిల్లాలో 80 మంది ఉన్నారన్నారు. ఆయా జిల్లాల్లో రౌడీషీటర్లు, హత్యారోపణలు ఎదుర్కొంటున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. సమాజంలో ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా రౌడీషీటర్లు, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో మెరుపుదాడులు చేయడంతో రౌడీషీటర్లు ఉలిక్కిపడ్డారు. రౌడీషీటర్ల ఇళ్లలో పోలీసులు జల్లెడ పట్టారన్నారు. ఎస్పీ సుమన్ పన్నేకర్ తదితరులు పాల్గొన్నారు.


