కుంటలో పడి ఇద్దరు జల సమాధి | - | Sakshi
Sakshi News home page

కుంటలో పడి ఇద్దరు జల సమాధి

Jun 23 2026 12:24 AM | Updated on Jun 23 2026 12:24 AM

మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు

రాయచూరు రూరల్‌: వ్యవసాయ పొలంలోని నీటి కుంటలో పడి ఇద్దరు నీటి పాలైన ఘటన కలబుర్గి జిల్లా సేడం తాలూకా మూగనూరులో చోటు చేసుకుంది. ఆదివారం గేదెలను మేపడానికి వెళ్లిన భద్రస్వామి(32), అతని అన్న కుమారుడు సదాశివస్వామి(10) అనే ఇద్దరూ స్నానం చేయడానికి నీటి కుంట వద్దకు వెళ్లారు. అయితే ఈత రాకపోవడంతో ఒకరిని రక్షించబోయి మరొకరుగా దిగి బురదలో కూరుకుపోయి మరణించారు. ఘటనతో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సేడం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

7 శాతం రిజర్వేషన్‌

అమలు చేయండి

హొసపేటె: రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన 7 శాతం ఎస్టీ రిజర్వేషన్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని వక్తలు డిమాండ్‌ చేశారు. సోమవారం సహకార సంక్షేమ హాలులో బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక న్యాయ అవగాహన సదస్సులో బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బీ.శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్టీ వర్గానికి 7 శాతం రిజర్వేషను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. ఎస్టీ రిజర్వేషన్‌ అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. సదస్సులో బీజేపీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేలు రమేష్‌ జార్కిహొళి, బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బంగారు హనుమంతు, శాసన మండలి సభ్యురాలు హేమలత నాయక్‌, మాజీ ఎంపీలు బీవీ నాయక్‌, సన్న పక్కీరప్ప, మాజీ ఎమ్మెల్యేలు రాజు గౌడ, ఎంఎస్‌. సోమలింగప్ప, ప్రతాప్‌ గౌడ పాటిల్‌, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, బీజేపీ ఎస్టీ మోర్చా కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినికి దక్కని అనుమతి

నీట్‌ పరీక్ష ప్రారంభానికి 5 నిమిషాల ముందు వచ్చినా కేంద్రంలోకి

అనుమతించని అధికారుల వైనం

హొసపేటె: నీట్‌ పరీక్ష ప్రారంభం కావడానికి కేవలం ఐదు నిమిషాల ముందు వచ్చిన ఒక విద్యార్థినిని పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించలేదు. కొప్పళలోని ప్రభుత్వ ఫస్ట్‌గ్రేడ్‌ కళాశాల పరీక్ష కేంద్రంలో జరిగిన ఈ ఘటనలో బీబీ ఫాతిమా అనే విద్యార్థినికి పరీక్ష గదిలోకి అనుమతి లభించలేదు. పరీక్ష రాయడానికి విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రం వద్దకు హాజరు కావాల్సి ఉంది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సి ఉంది. కొప్పళలోని పరీక్ష కేంద్రానికి చేరుకుంటుడగా వాహనం పాడవడంతో విద్యార్థిని పరీక్ష కేంద్రానికి చేరుకునేసరికి మధ్యాహ్నం 1.55 గంటలు అయింది. పరీక్ష కేంద్రానికి వచ్చిన విద్యార్థినిని పోలీసులు గేటు ద్వారా లోపలికి పంపించారు. కానీ పరీక్ష కేంద్రం అధికారులు ఆమెను పరీక్ష రాయడానికి అనుమతించలేదు. పదేపదే అభ్యర్థించినా ఆ విద్యార్థినికి పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement