క్రాస్‌ ఓటింగ్‌పై ప్రమాణం అవసరం లేదు | - | Sakshi
Sakshi News home page

క్రాస్‌ ఓటింగ్‌పై ప్రమాణం అవసరం లేదు

Jun 23 2026 12:24 AM | Updated on Jun 23 2026 12:24 AM

హొసపేటె: ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ చేయడంపై ధర్మస్థలంలో ప్రమాణం చేయాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి బీ.శ్రీరాములు తెలిపారు. నగరంలోని సహకార కళ్యాణ మంటపంలో సోమవారం నిర్వహించిన ఎస్టీ మోర్చా సామాజిక న్యాయ అవగాహన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మా నాయకుడు ప్రహ్లాద్‌ జోషి క్రాస్‌ ఓటింగ్‌ విషయంలో ప్రమాణం చేశారని ఆయన అన్నారు. సురేష్‌కుమార్‌ ఒక ప్రకటన ఇచ్చారు. నేను కూడా ఆయన ప్రకటనకు కట్టుబడి ఉన్నాను. ధర్మస్థలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. ధరస్థలానికంటూ ఒక పవిత్రత ఉంది. వ్యతిరేక ఓటు ఎవరు వేశారో నాకు కూడా తెలుసు. దీనిని పార్టీ వేదికపై పరిష్కరించుకోవడం సముచితం అని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర బాగా పని చేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. ఆ విషయంలో తమకు ఎలాంటి విభేదం లేదన్నారు.

అసమ్మతి బట్టబయలు

కాగా ఆదివారం బెంగళూరులోని ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో జరిగిన కేపీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం డీకే.శివకుమార్‌, కేపీసీసీ అధ్యక్షుడు బీకే.హరిప్రసాద్‌ల మధ్య ఉన్న అసమ్మతి బయట పడిందన్నారు. గాంధీ కుటుంబ తరంతో తాను కలిసి పని చేశానని చెప్పడం ద్వారా బీకే.హరిప్రసాద్‌ సీఎం డీకే.శివకుమార్‌కు హెచ్చరిక చేసినట్లు కనిపిస్తోందన్నారు. ఆర్‌ఎఎస్‌ గురించి మాట్లాడే హక్కు కేపీసీసీ అధ్యక్షుడు హరిప్రసాద్‌కు లేదని అన్నారు. ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ గెలవకుండా హరిప్రసాద్‌ దొడ్డిదారి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మున్ముందు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్‌ విసిరారు.

మాజీ మంత్రి శ్రీరాములు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement