పాచి పట్టిన కొలను నీరు, పేరుకున్న వ్యర్థాలు
అధ్వాన్నంగా మారిన ఈత కొలను
పిచ్చి మొక్కలతో నిండిన కొలను పరిసరాలు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించాలనే సదాశయంతో నిర్మించిన పథకాలు నీరుగారి పోతున్నాయి. కోట్లాది రూపాయలు వ్యయం చేసి నిర్మించిన ఈత కొలను పనికి రాకుండా పాచి పట్టిన ఉదంతం బెళగావిలో చోటు చేసుకుంది. దీంతో ఈత క్రీడాకారుల ఆశలు ఆవిరవుతున్నాయి. బెళగావి సిటీ కార్పొరేషన్ అధికారులు 2019లో రూ.5 కోట్లతో ఒలింపిక్ క్రీడల్లో వినియోగించే విధంగా హనుమాన్ నగర్‌లో అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన ఈత కొలను నిర్మాణానికి మాజీ శాసన సభ్యుడు ఫిరోజ్ సేట్‌్ భూమిపూజ చేశారు. ఈత నేర్చుకునే క్రీడాకారులకు ఉపయోగపడాలనే సదాశయంతో నిర్మించిన ఈతకొలను నాణ్యతకు అధికారులు తూట్లు పొడిచారు. అంతర్జాతీయ స్థాయి ఈత కొలనులో 500, 100 మీటర్ల పోటీలకు మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా నిర్మించారు. దుస్తులు మార్చుకోడానికి గదులు, అండర్‌గ్రౌండ్ ట్యాంక్‌లు, పంపింగ్ హౌస్‌లు, ఫిల్టర్ యూనిట్లు పాడై పోయాయి.
ముగ్గురు కమిషనర్లు మారినా..
ఇప్పటి వరకు బెళగావి సిటీ కార్పొరేషన్‌కు ముగ్గురు కమిషనర్లు మారినా గత ఏడేళ్ల నుంచి ఈత కొలను అభివృద్ధి విషయంపై శ్రద్ధ కనబరచలేక పోతున్నారని ప్రజలు, క్రీడాకారులు శాపనార్థాలు పెడుతున్నారు. ఈత కొలను చుట్టు పిచ్చి మొుుక్కలు మొలిచి, నీరు పాచి పట్టి కనిపిస్తూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో ఈత నేర్చుకొనే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మరో వైపు అధికారులు ఈత కొలను అభివృద్ధి విషయంలో అశ్రద్ధ కనబరచడంతో అధ్వాన్నంగా మారింది. ఇప్పటికై నా కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించి ఈత కొలనును అభివృద్ధి పరిచి క్రీడాకారులకు ఈత నేర్చుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
ఏడేళ్లుగా పోటీలకు
ఎంపిక కాని క్రీడాకారులు
కోట్లాది రూపాయల
నిధుల వ్యయం వృథా


