డీకేశీ అభిమాని పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

డీకేశీ అభిమాని పాదయాత్ర

Jun 22 2026 1:36 AM | Updated on Jun 22 2026 1:36 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డి.కే.శివకుమార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే యాదగిరి జిల్లా సురుపుర తాలూకా హలికెర నుంచి బెంగళూరు విధాన సౌధ వరకు పాదయాత్ర చేస్తానని ఆయన అభిమాని రామనగౌడ మాలి పాటిల్‌ గతంలో మారెమ్మ దేవికి మొక్కుకున్నాడు. ఇటీవల డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. రామనగౌడ మాలి పాటిల్‌ మొక్కు నెరవేరడంతో ఆదివారం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మూడు లేదా నాలుగు రోజుల్లో బెంగళూరులోని విధానసౌధకు చేరుకుంటానని ఆయన తెలిపారు.

నాణ్యమైన విద్యనందించాలి

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో విద్యా రంగం అబివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని రాయచూరు రూరల్‌ శాసన సభ్యుడు బసన గౌడ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్‌లో సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు పాఠశాల, కళాశాలలు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డి.కే.శివ కుమార్‌ అమలు చేసిన ఉచిత బస్సుపాసు పథకాన్ని విద్యార్థులు సద్వినియెగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ అరుణాంగ్శు గిరి, డీఎస్పీ శాంతవీర, ఆర్టీసీ డీసీ కందగల్‌, డీటీఓ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైటీపీఎస్‌ ఈడీగా జ్యోతిలక్ష్మి

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో సుమారు 40 శాతం విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న యరమరాస్‌ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం (వైటీపీఎస్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా జ్యోతి లక్ష్మి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వివిధ స్థాయిల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై చర్చించారు.

మంత్రి పదవి కేటాయించాలి

రాయచూరు రూరల్‌: మంత్రివర్గ విస్తరణలో విధాన పరిషత్‌ సభ్యుడు, సీనియర్‌ నాయకుడు వసంత్‌ కుమార్‌కు చోటు కల్పించి, కె.హెచ్‌.మునియప్పను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని మాదిగ సమాజం మహాసభ డిమాండ్‌ చేసింది. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సంచాలకుడు యల్లప్ప మాట్లాడారు. 2023 ఎన్నికల సమయంలో, ఇతర రాష్ట్రాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేశారన్నారు. 30 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న వసంత్‌ కుమార్‌కు ఈసారి మంత్రి పదవి కేటాయించాలని సూచించారు.సమావేశంలో అనిల్‌ కుమార్‌, చెన్నప్ప, కట్టముని, తిమ్మారెడ్డి, నాగరాజ, పరుశురామ్‌, జనార్దన పాల్గొన్నారు.

దొంగిలించబడిన

మొబైల్స్‌ రికవరీ

కెజీఎఫ్‌: కెజీఎఫ్‌ జిల్లా వ్యాప్తిలో దొంగతనానికి గురైన 23 మొబైల్స్‌ను సైబర్‌ క్రైం పోలీసులు కనుక్కుని బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ శివాంశు రాజ్‌పూత్‌ మాట్లాడుతూ.. దొంగిలించబడిన మొత్తం 23 మొబైల్‌ ఫోన్‌లను వాటి యజమానులను హస్తాంతరం చేశామని తెలిపారు. ఎవరైనా మొబైల్‌ ఫోన్లను పొగొట్టుకుంటే వెంటనే సీఇఐఆర్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. తద్వారా మొబైల్‌ ఫోన్‌లను కనుగొనడానికి సాధ్యమవుతుందని వెల్లడించారు. దొంగలించబడిన మొబైల్‌ ఫోన్లను కనుగొనడంలో శ్రమించిన పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement