హుబ్లీ: బీజేపీ అన్ని ఆటుపోట్లను అధిగమించి గట్టిగా నిలబడింది. క్రాస్ ఓటింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నాం. 2028లో బీజేపీని అధికారంలోకి తీసుకుని రావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఆదివారం బెళగావిలో యోగా దినోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో నాయకత్వ కొరతపై స్పందిస్తూ ఏదైనా ఓ ఘటన ఆధారంగా నాయకత్వాన్ని తీర్మానించడానికి సాధ్యపడదని తెలిపారు. జాతీయ నాయకులు తనను రాష్ట్ర అధ్యక్షుడు అని ఎక్కడా చెప్పలేదు. ఈ విషయం తాను చెప్పలేదు అని వెల్లడించారు. అలాంటి ప్రతిపాదన ఎక్కడ చర్చకు రాలేదని పేర్కొన్నారు. ఈసారి సూపర్ ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. కేంద్ర సర్కార్ నుంచి అవసరమైన నిత్యావసరాల సరఫరాకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా పాలన దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. ఎన్నికలు, ప్రమాణ స్వీకారం తదితర కార్యక్రమాలు ముగిసినా.. పంట నష్టం పరిహార చర్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే నీటి సమస్య తలెత్తినా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారో తెలియదన్నారు.


