బనశంకరి: ఎంబీబీఎస్ ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ పరీక్ష మళ్లీ జరిగింది. రాష్ట్రంలో బెంగళూరు సహా పలు నగరాలలోని కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య నీట్ పరీక్ష సాగింది. సుమారు 1.50 లక్షల మంది హాజరైనట్లు అంచనా. మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష ప్రక్రియ మొదలై సాయంత్రం 5:15 వరకు కొనసాగింది. తల్లిదండ్రులు పిల్లలను దీవించి పంపడం కనిపించింది. ఈసారి కూడా దుస్తులు, అలంకారాల విషయంలో కఠినంగా వ్యవహరించారు. జీన్స్ ధరించిన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. వేరే దుస్తులు ధరించి రావాలని సిబ్బంది వెనక్కి పంపించారు. పలు కారణాలతో గైర్హాజరైన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. సెంటర్ల వద్ద పెద్ద తుపాకులతో సాయుధ బలగాల బందోబస్తు ఏర్పాటైంది.
ఆలస్యంగా వచ్చి.. పరీక్ష మిస్
బెంగళూరు ఆర్‌సీ కాలేజీ పరీక్షా కేంద్రంలో ముగ్గురు విద్యార్థినులు ఆలస్యంగా రావడంతో వారిని అనుమతించలేదు. నగరంలో విపరీతమైన ట్రాఫిక్ వల్ల ఆలస్యమైందని వేడుకున్నా ఒప్పుకోలేదు, దీంతో విద్యార్థినులు విలపించారు. ఓ విద్యార్థిని 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చి గేటు ఎక్కి వెళ్లడానికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీస్ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. రెండు మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినవారిని బయటి గేట్‌లో తనిఖీలుచేసి లోపలికి వదిలారు, అయితే పరీక్షా హాల్‌ల వద్ద సిబ్బంది అడ్డుకుని వెనక్కి పంపడం గమనార్హం. మధ్యాహ్నం 1:30 గంటలకు పరీక్షాకేంద్రం గేట్లు బంద్ చేశారు. 2 నిమిషాలు లేటుగా వచ్చినవారందరూ బయటే ఉండిపోయారు. సంవత్సరం సమయాన్ని కోల్పోయామని వారు బాధపడ్డారు.
నెలమంగల వద్ద నిలిచిన రైలు
దొడ్డబళ్లాపురం: నెలమంగల వద్ద రైలు చెడిపోయి నిలిచిపోవడంతో నీట్ పరీక్షలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఆందోళన చెందారు. నెలమంగల తాలూకా సోంపుర వద్ద షోలాపూర్ వైపు వెళ్తున్న రైలు చెడిపోయి నిలిచిపోయింది. ఇదే రైలులో నీట్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు ఆలస్యమవుతుందని బెంబేలు పడ్డారు. ఈ రైలు నిలిచిపోవడం వల్ల హాసన్ నుంచి యశ్వంతపుర వస్తున్న రైలు ఆలస్యంగా నడిచింది. రెండు రైళ్లలోని నీట్ విద్యార్థులు చాలా మంది పరీక్షలు మిస్సయినట్లు తెలుస్తోంది. యోగా డే, కేపీసీసీ కార్యక్రమం, నీట్ పరీక్షలు వంటి చాలా కార్యక్రమాల వల్ల బెంగళూరులో ఉదయం నుంచి విపరీతమైన వాహన రద్దీ ఏర్పడింది. అనేక కూడళ్లలో ట్రాఫిక్ జాం అయ్యింది.
మైసూరులో హాల్ టికెట్ల తనిఖీ
బెంగళూరులోని ఓ సెంటర్‌లో..
బెంగళూరులోని ఓ కేంద్రంలో భారీ భద్రత
బెంగళూరు సహా పలు నగరాల్లో పరీక్షలు
ఆలస్యం కారణంగా అనేకమందికి నో


