చేద్దాం యోగా.. సంతోషంగా | - | Sakshi
Sakshi News home page

చేద్దాం యోగా.. సంతోషంగా

Jun 22 2026 1:36 AM | Updated on Jun 22 2026 1:36 AM

మైసూరు: భారతదేశంలో యోగా అనేది ప్రాచీన సంప్రదాయం, షట్‌ దర్శనాలలో ఒకటి. ఇది వ్యాయామమే కాదు, సంపూర్ణ జీవితాన్ని ఎలా గడపాలో బోధించే ఒక తత్వశాస్త్రం అని మైసూరు ఎంపీ యదువీర్‌ కృష్ణదత్త ఒడెయార్‌ అన్నారు. ఆదివారం ఉదయం ప్యాలెస్‌ మైదానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా‘ అనే నినాదంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆచరించారు. యోగా సాధన శారీరక కదలికలకు మాత్రమే పరిమితం కాదని, అది ఓర్పును, బలాన్ని కూడా పెంచుతుందని, ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. మైసూరు ఆధునిక యోగాకు కేంద్రంగా ఆవిర్భవించింది, యోగాకు మరింత ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యకరమైన, ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడానికి మనమందరం కృషి చేయాలని చెప్పారు. మైసూరులోని వందలాది ప్రాంతాలలో యోగా ఉత్సవాలు జరిగాయి. నేటి హడావుడి, తీరికలేని జీవితంలో ప్రతి ఒక్కరికీ శాంతిని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి యోగాకు ఉందని యోగా గురువులు బోధించారు. ప్యాలెస్‌ ఆవరణలో వేలాది మంది ప్రజలు, యువత యోగాసనాలను ఆచరించారు. అలాగే రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలలో ఉత్సాహంగా యోగా వేడుకలు జరిగాయి. పిల్లలూ, పెద్దలూ వయోభేదం లేకుండా పాల్గొని ఆసనాలు వేశారు.

విధానసౌధలో వేడుకలు

యశవంతపుర: ప్రపంచానికి మన రుషులు, మునులు ఇచ్చిన పెద్ద బహుమతి యోగా అని అరోగ్యశాఖ మంత్రి యుటీ ఖాదర్‌ అన్నారు. బెంగళూరు విధానసౌధ ముందు యోగా వేడుకలు జరిగాయి. గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌, మంత్రి యుటీ ఖాదర్‌, వందలాది యోగాభ్యాసకులు పాల్గొన్నారు. మన రుషులు ఇచ్చిన ప్రాచీన బహుమతితో అందరూ యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ యోగా గురువులను నియమిస్తామని చెప్పారు. యోగా చేసేవారు తమ ఇరుగు పొరుగు ఇళ్లవారితో కూడా యోగా చేయించాలని సూచించారు.

ఎలాంటి ఖర్చు అవసరం లేని వ్యాయామం, జీవన ఆరోగ్య సూత్రాలను కలిగిన యోగా, ఇది నేటి డిజిటల్‌ యుగంలో ఆవశ్యకంగా మారింది. ఉరుకుల పరుగులతో కూడిన జీవనంలో యోగాభ్యాసం నెమ్మది, ఆనందాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. నిత్యం యోగా చేయడం ద్వారా మంచి ఆరోగ్యంగా ఉండవచ్చని యోగా గురువులే కాదు, వైద్యులూ చెబుతున్నారు. అందుకే యోగా శిబిరాలు కళకళలాడుతూ ఉంటాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన రెట్టించిన ఉత్సాహంతో అభ్యాసకులు, ప్రజలు పాల్గొన్నారు. బెంగళూరు, మైసూరు సహా అనేక నగరాలలో యోగా వైభవం అంబరాన్ని తాకింది.

రాష్ట్రంలో ఆనందోత్సాహాలతో యోగా దినోత్సవం

వేలాది మందితో సామూహిక

యోగా ఆచరణలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement