మెట్రో స్టేషన్‌లో మంటలు | - | Sakshi
Sakshi News home page

మెట్రో స్టేషన్‌లో మంటలు

Jun 22 2026 1:36 AM | Updated on Jun 22 2026 1:36 AM

దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని నాగసంద్ర మెట్రోస్టేషన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. మాదావర –సిల్క్‌బోర్డు మార్గంలోని నాగసంద్ర స్టేషన్‌లో అత్యవసర ద్వారం వద్ద ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో హఠాత్తుగా పెద్దగా పొగ, మంటలు లేచాయి. బోర్డులో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఫైర్‌ సిబ్బంది ఆర్పివేశారు. ఈ ఘటనతో అందరూ గాభరాపడ్డారు. ప్రయాణికులకు, సర్వీసులకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు.

బాల్య వివాహం కేసులో నలుగురికి 20 ఏళ్ల జైలు

శివమొగ్గ: ఒక బాలికను పెళ్లాడి, లైంగిక దాడికి పాల్పడిన యువకుడు, అతనికి సహకరించిన ముగ్గురు బంధువులకు శివమొగ్గ అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు (ఎఫ్‌టిఎస్‌సి–1) 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తలా రూ. 1.85 లక్షల జరిమానా కూడా విధించింది. బాధితురాలైన బాలికకు రూ. 4 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జడ్జి నింగనగౌడ పాటిల్‌ ఈ తీర్పును ఇచ్చారు. ప్రాసిక్యూటర్‌ శ్రీధర్‌ హెచ్‌. ఆర్‌. వాదనలు వినిపించారు. శివమొగ్గ తాలూకాలోని కుంసిలో 2024లో 27 ఏళ్ల యువకుడు 17 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో కొందరు ఫిర్యాదు చేయగా అతనిపై, బంధువులపై పోక్సో కేసు దాఖలైంది. విచారణలో నేరం రుజువు కావడంతో కఠిన శిక్ష విధించారు.

అట్టహాసంగా సారథ్య స్వీకారం

బనశంకరి: కేపీసీసీ నూతన అధ్యక్షునిగా పార్టీ సీనియర్‌ నేత బీకే.హరిప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. ఏఐసీసీ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం డీకే.శివకుమార్‌, మాజీ సీఎం సిద్దరామయ్య , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పదవిని డీకే శివకుమార్‌ నిర్వహిస్తుండగా, ఆయన సీఎం కావడంతో రాజీనామా చేయడం తెలిసిందే. తదుపరి హరిప్రసాద్‌ ఈ నెల 4 నుంచే నియమితులయ్యారు. డీకే పార్టీ జెండాను బీకేకు అప్పగించారు.

బిడదిలో జేడీఎస్‌ పాదయాత్ర

గొడవతో ఉద్రిక్తత

దొడ్డబళ్లాపురం: జేడీఎస్‌ పార్టీ రైతుల కోసమే బిడది పాదయాత్ర చేస్తోందని జేడీఎస్‌ రాష్ట్ర యువ అధ్యక్షుడు నిఖిల్‌ కుమారస్వామి అన్నారు. ఆదివారంనాడు బిడది వద్ద అంచిపుర నుంచి పాదయాత్ర ప్రారంభానికి ముందు శక్తి దేవత మారెమ్మ దేవాలయంలో పూజలు చేసి మాట్లాడారు. రైతులు 16 నెలలుగా టౌన్‌షిప్‌ వద్దని పోరాటం చేస్తుంటే ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. తాము రైతులతో చర్చించామని,చాలామంది రైతులు టౌన్‌ షిప్‌కు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. రైతులతో కలిసి జేడీఎస్‌ చివరి వరకూ పోరాడుతుందన్నారు. రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు రైతులను మోసగించి భూములు స్వాహా చేస్తున్నారన్నారు. కాగా, కొందరు జేడీఎస్‌ ఫ్లెక్సీలను చించేయడంతో వారితో కార్యకర్తలు గొడవ పడ్డారు. ఉద్రిక్తత ఏర్పడడంతో నిఖిల్‌ కారు ఎక్కి వెళ్లిపోయారు. టౌన్‌షిప్‌ ఏర్పాటైతే తమ జీవితాలు బాగుపడతాయని, మా భూమి–మా హక్కు అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు.

కూలిన కాంక్రీటు బకెట్‌..

ఇద్దరు కూలీల బలి

సాక్షి, బళ్లారి: సండూరు తాలూకా కుడితిని పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం పట్టణంలోని హెచ్‌ఎల్‌సీ కాలువ సమీపంలో నిర్మాణంలో ఉన్న నీటి ట్యాంకు వద్ద 60 అడుగుల ఎత్తు నుంచి కాంక్రీట్‌ లిఫ్ట్‌ బకెట్‌ మీద పడిపోవడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. రోజూ మాదిరిగా ట్యాంకు పనుల్లో కార్మికులు నిమగ్నమయ్యారు. ఆ సమయంలో కాంక్రీటును పైకి తరలిస్తున్న లిఫ్ట్‌ బకెట్‌ వైరు తెగి పడిపోయింది. కింద పనిచేస్తున్న తిమ్లాపుర గ్రామానికి చెందిన మల్లప్ప (52), గణికాల్‌ వాసి నీలప్ప (35) అనే కూలీల మీద పడగా, తీవ్రగాయాలో చనిపోయారు. అధికారులు, కాంట్రాక్టర్‌ కనీస రక్షన చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని కార్మికులు, మృతుల కుటుంబసభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కుడితిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement