ధర్మస్థలలో బీజేపీ ఎమ్మెల్యేల సత్యప్రమాణం | - | Sakshi
Sakshi News home page

ధర్మస్థలలో బీజేపీ ఎమ్మెల్యేల సత్యప్రమాణం

Jun 22 2026 1:36 AM | Updated on Jun 22 2026 1:36 AM

బనశంకరి: విధానపరిషత్‌ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన పార్టీ ఎమ్మెల్యేలను కనిపెట్టడానికి బీజేపీ నేతలు ధర్మస్థల శ్రీ మంజునాథస్వామిని ఆశ్రయించనున్నారు. మంజునాథుని సన్నిధిలో అనుమానిత ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. దేవునిపై భయం వల్ల ఎవరైనా నిజం చెబుతారని నాయకులు భావిస్తున్నారు. ఆదివారం బెంగళూరులో విలేకరులతో బీజేపీ రాష్ట్రాద్యక్షుడు బీవై.విజయేంద్ర మాట్లాడుతూ క్రాస్‌ ఓటింగ్‌ నేపథ్యంలో అతి త్వరలో ధర్మస్థల మంజునాథస్వామి ఆలయంలో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరపాలని నిర్ణయించామని తెలిపారు. తల్లి వంటి పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేల వ్యవహారం సత్యప్రమాణంతో తెలుస్తుందన్నారు. తాము క్రాస్‌ఓటింగ్‌ చేయలేదని అందరూ చెబుతున్నారన్నారు. పార్టీ కార్యకర్తలు తమ ఎమ్మెల్యేల ప్రవర్తన పట్ల విచారంతో ఉన్నారన్నారు. బీజేపీలో మొత్తం 63 మంది ఎమ్మెల్యేల పట్ల అనుమానం ఏర్పడిందని, ఇది తనకు చాలా ఇబ్బందిగా ఉందని వాపోయారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌తో మాట్లాడానని, తాను, అశోక్‌ మంగళవారం ఢిల్లీకి వెళ్లి ఈ పరిణామాలపై చర్చిస్తామని చెప్పారు.

11 మంది క్రాస్‌ ఓటింగ్‌: అశోక్‌

పొత్తు పక్షాలైన జేడీఎస్‌, బీజేపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు, వారిని కనిపెట్టేందుకు నిజ నిర్ధారణ కమిటీ వేసినట్లు బీజేపీ పక్ష నేత ఆర్‌.అశోక్‌ తెలిపారు. నగరంలో మాట్లాడుతూ క్రాస్‌ఓటింగ్‌ కు పాల్పడినవారిని వదిలేది లేదన్నారు. కానీ వారెవరో గుర్తించడం సవాల్‌గా మారిందన్నారు. ఎవరినీ అడిగినా మేము దేవునిపై ప్రమాణం చేస్తాం అంటున్నారని, అదే ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. దీంతో ధర్మస్థల మంజునాథస్వామి సన్నిధిలో ప్రమాణం చేయించి కనిపెడతామన్నారు. హైకమాండ్‌తో చర్చించి కఠినమైన గుణపాఠం చెబుతామన్నారు.

క్రాస్‌ ఓటింగ్‌ చేసిన వారిని కనుగొంటాం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement