మైసూరు: రాజభవనాలు, చారిత్రక కట్టడాలతో రాజసం ఉట్టిపడే మైసూరు మహానగరం అంతర్జాతీయ యోగా ఉత్సవాలకు ముస్తాబైంది. ఆదివారం యోగా దినోత్సవం అట్టహాసంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విభిన్నంగా, వినూత్నంగా జరపడానికి ప్రణాళికలు రూపొందించారు. చారిత్రక ప్యాలెస్ మైదానం ముస్తాబైంది.
మొదటిసారి 10 మందితో...
ఈసారి జూన్ 21 ఆదివారం రావడంతో విద్యార్థులు, ఉద్యోగులే కాక చాలామంది ప్రజలు సెలవులో ఉంటారు. అయినప్పటికీ ఉత్సాహంగా యోగా డే ఆచరిస్తామని, వీలును బట్టి, సోమవారం కూడా ఆచరించవచ్చని మైసూరు యోగా ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీహరి ద్వారకనాథ్ తెలిపారు. 2015లో ప్రధాని ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రకటించినప్పుడు, మొదటిసారి వర్షం పడుతున్నప్పటికీ 10 మందితో యోగా డే నిర్వహించినట్లు పేర్కొన్నారు. 2017లో, 55,000 మందిని ఇందులో భాగస్వాములను చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాము, ఆ తర్వాతి సంవత్సరాలలో, 65,000, ఆపై 75,000 వేల మందితో బృహత్ స్థాయిలో జరిగినట్లు తెలిపారు. 2022లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా మైసూరు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. కోవిడ్ కాలంలో కూడా లక్షలాది మంది ప్రజలు ఇళ్లలోనే యోగా చేశారు.
పాల్గొననున్న వేల మంది
మైసూరులో ఈసారి యోగా డేలో 120 సంస్థలు, 1.20 లక్షల మంది మంది సాధకులు పాల్గొంటారని ఆశిస్తున్నారు. 1,200 మంది యోగా గురువులు నాయకత్వం వహిస్తారు. ప్యాలెస్ మైదానంలోనే కాకుండా నగరంలోని ప్రముఖ ప్రాంతాలలోనూ యోగా డే ఉత్సవాలు జరుగుతాయి. అధికారులు, ప్రజలతో పాటు ప్రముఖ స్వాములకు ఆహ్వానం పలికారు. ఒక్క మైసూరే కాదు, చారిత్రక స్థలాలైన హంపీ, బాదామి, పట్టదకల్, అలాగే బెంగళూరు విధానసౌధ ఆవరణ తదితర ప్రాంతాల్లో సామూహిక యోగా వేడుకలు జరగనున్నాయి.
నేడు మైసూరు సహా పలు చారిత్రక ప్రాంతాల్లో యోగా దినోత్సవ వేడుకలు


