తిమ్మప్ప.. యోగా సాధన భేషప్ప | - | Sakshi
Sakshi News home page

తిమ్మప్ప.. యోగా సాధన భేషప్ప

Jun 21 2026 12:19 AM | Updated on Jun 21 2026 12:19 AM

రాయచూరు రూరల్‌: పేదరికంలో పుట్టి కష్టాలను అనుభవించినా యోగా ద్వారా పేరు ప్రఖ్యాతులు సాధించిన డాక్టర్‌ వడ్డేపల్లి తిమ్మప్ప పలువురికి యోగాసనాలు నేర్పిస్తూ ఆరోగ్యకర జీవితానికి దిశానిర్దేశం చేస్తున్నారు. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో తిమ్మప్ప యోగా సాధకుడిగా మంచి పేరు సాధించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని, యోగా ద్వారా నలుగురికి సహాయ పడాలనే ఉద్దేశ్యంతో యోగా శిక్షణను ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులకు, జైళ్లలోని ఖైదీలకు, అనాథఽ బాలలకు, సామాన్య ప్రజలకు ఉచితంగా యోగా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్‌ వడ్డేపల్లి తిమ్మప్ప జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు యోగాభ్యాస పోటీల్లో పాల్గొని పలు అవార్డులు పొందారు. కర్ణాటక విశ్వ విద్యాలయం నుంచి 2007లో బంగారు అవార్డు, 2009 ఫిబ్రవరిలో సన్మానం, 2008 జనవరిలో పాండిచ్చేరీలో జరిగిన జాతీయ యోగా చాంపియన్‌షిప్‌ పోటీల్లో 4వ స్థానాన్ని పొందారు.

తిమ్మప్పకు అవార్డుల పంట

15 సార్లు రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని 5 బంగారు, 8 వెండి పతకాలు సాధించారు. 2010లో భారత వాహనాల డ్రైవర్‌ ట్రేడ్‌ యూనియన్‌ నుంచి అత్యుత్తమ యోగా ప్రదర్శన అవార్డును అందుకున్నారు.

మారుమూల గ్రామంలో పుట్టి..

రాయచూరు తాలూకాలోని మారు మూల వడ్డేపల్లిలో బసమ్మ, పెద్ద నరసప్పల జ్యేష్ట పుత్రుడిగా జన్మించిన తిమ్మప్ప చదువుకోవడానికి పేదరికం అడ్డు వచ్చింది. ప్రాథమిక పాఠశాలలో మాస్టారు కై లాసచంద్ర చేర్పించగా ఐదవ తరగతి వరకు చదివారు. 10వ తరగతి వరకు 5 కి.మీ.ల దూరంలోని యాపలదిన్నికి ప్రతి నిత్యం నడుచుకుంటూ వెళ్లేవారు. రాయచూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1995లో పీయూసీ పూర్తి చేశారు. కళాశాల చదువుకు శ్రీనివాస్‌ రాయచూరకర్‌, హన్మంతప్ప, నాగరాజ్‌, మల్లికార్జునలు సహకరించారు. 1998లో డిగ్రీని పూర్తి చేశారు. నగరంలో హార్డ్‌వేర్‌, ప్లైవుడ్‌ షాపుల్లో బియ్యం, ఆయిల్‌, పత్తి మిల్లులో పనులు చేయగా వచ్చిన డబ్బుతో 2000లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ను, 2004లో డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ(పీహెచ్‌డీ)ని పూర్తి చేశారు.

విద్యార్థులు, ఖైదీలు, అనాథలకు

ఉచితంగా యోగా శిక్షణ

సందర్భం:

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement