రాయచూరు రూరల్: జిల్లాలో 2026–27వ విద్యా సంవత్సరానికి సంబంధించి ఆడ పిల్లలకు కిశోరి కేంద్రం ప్రారంభించినట్లు బాలల హక్కుల రక్షణ సభ్యుడు సత్య నారాయణ పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను చూసి బాల్య వివాహాల నిర్మూలన, రక్తహీనత, ఆప్త సమాలోచనలు, మహిళల సమస్యల పరిష్కారానికి అవకాశాలను కల్పించారు. పరిశీలనలో మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లాధికారిణి శరణమ్మ, గోకార్ సాబ్, మన్సూర్ అహ్మద్‌లున్నారు.
ఎయిమ్స్ మంజూరు చేయండి
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు చేపట్టాలని కొప్పళ జిల్లా నేతలు ఆందోళనకు మద్దతు పలికారు. శనివారం కొప్పళ తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సమితి అధ్యక్షుడు మంజునాథ గొండబాళ మాట్లాడుతూ ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాయచూరు, కొప్పళ జిల్లా ప్రజాప్రతినిధులు చర్చించి రాయచూరుకు ఎయిమ్స్‌ను కేటాయించేలా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో మౌనం వహించకుండా గళం విప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలన్నారు. శంభులింగప్ప, విజయ మహంతేష్, మహదేవప్ప, మల్లికార్జున, శివప్ప, రాజశేఖర్‌లున్నారు.
కేపీసీసీ అధ్యక్షుడితో భేటీ
సాక్షి,బళ్లారి: నూతనంగా నియమితులైన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు బీ.కే హరిప్రసాద్‌ను పలువురు బళ్లారి కాంగ్రెస్ ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. శనివారం బుడా అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బోయపాటి విష్ణు తదితరులు ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, పార్టీ పురోభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. బళ్లారి జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.
మైనార్టీల సంక్షేమానికి కృషి
రాయచూరు రూరల్: మైనార్టీల సంక్షేమానికి పాటు పడతానని ఎమ్మెల్సీ వసంత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని హరిజనవాడలో మైనార్టీ నేతల నుంచి సన్మానాన్ని స్వీకరించి ఆయన మాట్లాడారు. జ్యోతి కాలనీలో మదరసా, మహిళా మదరసాలకు రూ.50 లక్షల చొప్పున కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా రజాక్ ఉస్తాద్, షెక్షావలి, హఫీజ్, కమరలి, ఖలీల్, నిసార్, అజరుద్దీన్, జిలానీ, అశ్రఫ్‌లున్నారు.
పైకప్పు కూలిన ఘటనలపై నివేదిక ఇవ్వండి
రాయచూరు రూరల్: కలబుర్గిలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాల, కళాశాల పైకప్పు కూలి విద్యార్థులకు తీవ్ర గాయాలైన ఘటనపై వివరాలను సేకరించి నివేదిక పంపాలని కలబుర్గి జెడ్పీ సీఈఓ రాహుల్ సంకనూరు అధికారులను ఆదేశించారు. వారం రోజుల వ్యవధిలో కలబుర్గి బాలికల జూనియర్ కళాశాల, ఆళంద ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో ఉన్నఫళంగా సిమెంట్, కాంక్రీట్‌తో కూడిన పైకప్పులు కింద పడ్డాయి. సెలవు రోజు కావడంతో విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. గదుల నిర్మాణాలు నాసిరకంతో చేశారని, అందువల్లే పైకప్పులు ఊడిపడుతున్నాయని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా ఉంచాలని ఆయన సూచించారు.


