సాక్షి,బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అవినీతి జరిగిందని ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేంద్ర తన మంత్రి పదవిని పోగొట్టుకోవడంతో పాటు ఈ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు చేయడంతో పాటు సీబీఐ, ఈడీ కూడా రంగంలోకి దిగి పూర్తి విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల అవినీతిలో కూరుకుపోయిన మాజీ మంత్రి నాగేంద్ర బెయిల్‌పై విడుదలయ్యారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా, బళ్లారి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా కూడా పని చేసిన నాగేంద్ర అనతి కాలంలోనే తన పదవిని కాపాడుకోలేకపోయారు.
నిధుల మళ్లింపు ఆరోపణలు
ఎస్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థుల సంక్షేమం కోసం కేటాయించిన కోట్లాది రూపాయల నిధులను స్వాహా చేసి వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సీబీఐ, ఈడీ అందుకు సంబంధించి విచారణ చేయడంతో నాగేంద్ర పాత్ర స్పష్టంగా కనిపించడంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. కోట్లాది రూపాయల నిధులను ఆర్‌టీజీఎస్, చెక్కులు, వివిధ లావాదేవీల ద్వారా మళ్లించుకుని స్వాహా చేశారని తేలింది. బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ మంత్రి పదవి దక్కించుకునేందుకు సిద్దరామయ్య మంత్రివర్గంలోనే తీవ్ర ప్రయత్నాలు చేశారు. అప్పట్లో సీఎం సిద్దరామయ్య కూడా నాగేంద్రకు మళ్లీ మంత్రి పదవి ఇవ్వడానికి సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే వివిధ కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణ చేయకపోవడంతో నాగేంద్రకు మంత్రి పదవి దక్కలేదు.
మంత్రి పదవి కోసం నానాపాట్లు
ఈనేపథ్యంలో బెంగళూరులోనే మకాం వేసి, కాంగ్రెస్ పెద్దలను కలుసుకుంటూ తిరిగి మంత్రి పదవి పొందేందుకు నాగేంద్ర పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో నాగేంద్రకు మంత్రి పదవి దక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతున్న తరుణంలో సీబీఐ నాగేంద్రకు పెద్ద షాక్ ఇచ్చింది.వాల్మీకి అభివృద్ధి మండలి అవినీతి ఆరోపణలకు సంబంధించి జైలుకు వెళ్లి బెయిల్‌పై ఉన్న నాగేంద్ర మళ్లీ ఈ కేసు మలుపు ఎటు వైపు తిరుగుతుందోనని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నాగేంద్ర బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును సీబీఐ ఆశ్రయించిన తరుణంలో నాగేంద్ర తరుపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించారు. దీంతో మంత్రి పదవిని ఆశిస్తున్న నాగేంద్ర పరిస్థితి డోలాయానంలో పడింది.
బెయిల్ రద్దు కోరిన వైనం
హైకోర్టులో పిటిషన్ దాఖలు
మళ్లీ ఇబ్బందుల్లో మాజీ మంత్రి
మలి విడత విస్తరణలో చోటు దక్కేనా?


