ఎస్‌టీపీని పరిశీలిస్తున్న డాక్టర్ మంజుల, ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారులు ఎస్‌టీపీ నమూనాను మ్యాప్‌పై పరిశీలిస్తున్న అధికారులు
బనశంకరి: వర్తూరు బెళగెరెలోని జలమండలి మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం(ఎస్‌టీపీ)లో గురువారం సాయంత్రం కాంట్రాక్టు కార్మికులు పని చేస్తుండగా ముగ్గురు కార్మికులు అదుపుతప్పి ట్యాంక్‌లోకి పడిపోయారు. వెంటనే తోటి కార్మికులు ఒక కార్మికుడిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన బిహార్‌కు చెందిన బ్రిజేశ్(29), తమిళనాడుకు చెందిన అఖిలేశ్(30) కోసం గాలింపు కొనసాగుతోంది. రాత్రి కావడంతో గాలింపు నిలిపివేసి శుక్రవారం తెల్లవారు జాము నుంచి మళ్లీ గాలింపు కొనసాగించారు. ఇప్పటివరకు వారి జాడ లభించలేదు. 40 అడుగుల లోతు ఉన్న మురుగునీటి శుద్ధీకరణ కేంద్రంలో సేకరించిన 30 అడుగుల లోతు నీటిని సిబ్బంది ఖాళీ చేసి గాలింపు కొనసాగిస్తున్నారు. కేంద్రంలోకి అదుపుతప్పి పడిపోయిన ఇద్దరు కార్మికుల కోసం వర్తూరు పోలీసులు, అగ్నిమాపక, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. కాగా ఈ ఘటనపై సమ్రగ్ర దర్యాప్తు జరిపించి నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు జలమండలి అధ్యక్షురాలు డాక్టర్ మంజుల తెలిపారు. శుక్రవారం ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. ఈ దురదృష్టకర ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఎస్‌టీపీ కేంద్రం వద్ద రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఓ కార్మికుడిని వెంటనే కాపాడి ఆసుపత్రికి తరలించారని, గల్లంతైన ఇద్దరు కార్మికులు బ్రిజేశ్, అఖిలేశ్‌ల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు. డ్రైనేజీ ట్యాంక్‌లో విషకారక అంశాలు కలిగి ఉండటం, నీటి ఉధృతి అధికంగా ఉండటంతో రక్షణ కార్యాచరణకు తీవ్ర అడ్డంకిగా మారిందన్నారు. ట్యాంక్ వద్దకు అగ్నిమాపక సిబ్బందితో పాటు జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ బృందం నిపుణులను పిలిపించామన్నారు. రక్షణా సిబ్బంది ట్యాంక్‌లోకి దిగడానికి ముందు లోపల ఉన్న విషకారక అంశాలు బయటికి తీసి ట్యాంక్‌లో ఆమ్లజనకాన్ని నింపడానికి చర్యలు తీసుకున్నామన్నారు.
గాలిస్తున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
పరిశీలించిన జలమండలి అధ్యక్షురాలు


