రాయచూరు రూరల్: ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం యోగా చేయాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆయుర్వేద, యూనానీ శాఖల ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగా చేస్తే మానసిక ఒత్తిడి దూరం అవుతుందని పేర్కొన్నారు. యోగాసనాలతో ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ సజ్జన్, శంకర్ గౌడ పాటిల్, శంకర్ గౌడ, పూజ, చంద్రశేఖర్ పవార్, వీరేష్ నాయక, దండప్ప బిరదార్, ఉపాధ్యాయుడు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
బళ్లారి టౌన్: యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక నెమ్మది లభిస్తుందని జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్.టి.పనేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పాలన, జిల్లా పంచాయతీ, ఆయుష్ శాఖ వివిధ యోగా సంస్థల ఆధ్వర్యంలో బృహత్ జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతుఊ.. ఇటీవల రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్న డయాబెటిస్, బీపీ తదితర ఆరోగ్య సమస్యలను నియంత్రించేందుకు యోగా ఉత్తమ మార్గం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలకు యోగా ఉత్తమ ఔషధం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, యోగా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


