సకాలలో మైసూరు ప్రథమం | - | Sakshi
Sakshi News home page

సకాలలో మైసూరు ప్రథమం

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

1.20 లక్షల అర్జీల పరిష్కారం

మైసూరు: సకాల పథకం అమలు ప్రగతిలో ఏప్రిల్‌ నెలలో మైసూరు జిల్లా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానాన్ని పొందింది. ప్రభుత్వ సేవలను నిర్ణీత గడువులో పొందేందుకు ప్రభుత్వం సకాల పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా కుల, ఆదాయ, వంశవృక్షతో పాటు వెయ్యికి పైగా సేవలను అందిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సకాల పథకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడంతో ఏప్రిల్‌ నెలలో 1,20,456 అర్జీలను పరిష్కరించారు. 1,19,801 అర్జీలను స్వీకరించారు. 9,937 అర్జీలు తిరస్కృతి అయ్యాయి. స్వీకృతి శాతం 98.34 ఉండగా, తిరస్కృతి కూడా 8.25 శాతం మేర ఉంది. నిర్ణీత కాలంలో 1,18,456 అర్జీలు బట్వాడా అయ్యాయి. ప్రజలు సకాల పథకాన్ని సద్వినియోగపరచుకోవాలని కలెక్టర్‌ లక్ష్మికాంతరెడ్డి తెలిపారు.

కోలుకుంటున్న మంత్రి సుధాకర్‌

యశవంతపుర: తీవ్ర శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యోజనా, గణాంక శాఖ మంత్రి డి సుధాకర్‌ అరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆయన సోదరుడు డి.కుమార్‌ తెలిపారు. కళ్లు తెరిచి చూసి మాట్లాడారు, ఆరోగ్యం మెరుగుపడుతోంది, నూరు శాతం ఆరోగ్యవంతుడు అవుతారని కుమార్‌ తెలిపారు. సుమారు 10 రోజుల కిందట మోకాళ్ల నొప్పుల కారణంగా మంత్రి సుధాకర్‌ బెంగళూరు మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. తరువాత శ్వాసకోశ సమస్య తీవ్రం కావడంతో కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

కారు దగ్ధం.. మహిళ మృతి

దొడ్డ వద్ద అనుమానాస్పద ఘటన

దొడ్డబళ్లాపురం: కారులో మంటలు లేచి కాలిపోయిన ఘటనలో మహిళ సజీవ దహనమైంది. ఈ సంఘటన దొడ్డబళ్లాపురం తాలూకాలోని బాశెట్టిహళ్లి శివారులో వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బాశెట్టిహళ్లి పారిశ్రామికవాడలోని చపేరియా ఫ్యాక్టరీ వెనుక నిర్మానుష్య ప్రదేశంలో ఏకాంతంగా గడపడానికి బ్యాటరీ కారులో ఓ జంట వచ్చింది. కొంతసేపటికి కారులో మంటలు చెలరేగాయి. పురుషుడు బయటకు దూకి పరారయ్యాడని, మహిళ లోపలే సజీవంగా కాలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇది ప్రమాదమా, హత్యా అనేదానిపై భిన్నాంశాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ జంట ఊరు పేరు కూడా తెలియడం లేదని పోలీసులు చెప్పారు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారులోని అవశేషాలను సేకరించి ఆస్పత్రికి తరలించారు.

టెన్త్‌ టాపర్‌ బలవన్మరణం

దొడ్డబళ్లాపురం: ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా భైరేగౌడనహళ్లి గ్రామంలో జరిగింది. చిక్కబళ్లాపురానికి చెందిన రాఘవేంద్ర, జ్యోతి దంపతుల కుమార్తె సంధ్య (16), నెలమంగల తాలూకా భైరేగౌడనహళ్లిలోని తన అక్క ఇంట్లో ఉండేది. ఇటీవల ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల్లో 90 శాతం మార్కులతో పాసై కాలేజీలో చేరడానికి సిద్ధమైంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఉన్న సంధ్య ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. సారీ నాన్నా అని డెత్‌నోట్‌ రాసింది. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సూచన

శివాజీనగర: డిమాండ్ల సాధన కోసం కేఎస్‌ ఆర్టీసీ, బీఎంటీసీ ఉద్యోగులు ఈ నెల 20 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సంయుక్త క్రియా సమితి సంచాలకుడు జయదేవరాజ అరస్‌ శనివారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలి, లేనిపక్షంలో సమ్మెను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. 20 ఉదయం 6 గంటల నుంచి సమ్మె ఆరంభమవుతుందని ప్రకటించారు. సుమారు 1.25 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈ పోరాటంలో పాల్గొంటారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement