15 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

15 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

బళ్లారిటౌన్‌: బళ్లారి గ్రామీణ నియోజకవర్గం పరిధిలో వివిధ సర్వే నెంబర్లలోని 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారి నుంచి జిల్లా యంత్రాంగం తిరిగి స్వాధీనం చేసుకుంది. సర్వే నెంబర్‌–977లో 9.20 ఎకరాలు, సర్వే నెంబర్‌– 976లో 4.72 ఎకరాలు, సర్వే నెంబర్‌–813లో 13 ఎకరాల భూమిని శనివారం అధికారికంగా జిల్లా యంత్రాంగం జప్తు చేసుకుంది. ఈ సందర్భంగా ఏడీసీ మహ్మద్‌ జుబేర, ఏసీ రాజేష్‌, తహసీల్దార్‌ టీ.రేఖ, పోలీస్‌ బలగాలు పాల్గొన్నాయి.

నేత్రపర్వంగా వడకరాయ రథోత్సవం

హొసపేటె: నగరంలోని చారిత్రాత్మక వడకరాయ స్వామి రథోత్సవం శుక్రవారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. నగరంలోని ప్రధాన బజారులో ఉన్న వడకరాయ స్వామి రథానికి పూజలు జరిపి, ఆ రథంలో వడకరాయను ప్రతిష్టించారు. అనంతరం ఆ రథాన్ని వడకరాయ ఆలయం నుంచి ఎదురుగా ఉన్న ఆంజనేయ ఆలయం వరకు లాగారు. భక్తులు రథంపైకి అరటి పండ్లు, ధవనం విసిరి తమ భక్తిని చాటుకున్నారు. రథాన్ని లాగిన భక్తులు వడకరాయ అనుగ్రహాన్ని పొందారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు జిల్లా ఎస్పీ ఎస్‌.జాహ్నవి, అదనపు ఎస్పీ జీ.మంజునాథ్‌ల మార్గదర్శనంలో డీఎస్పీ డాక్టర్‌ టీ.మంజునాథ్‌ ఆధ్వర్యంలో పీఐలు డీ.హులుగప్ప, గురురాజ కట్టిమని, మహమ్మద్‌ గౌస్‌, సోమనాయక్‌, తమ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

బైక్‌ల దొంగ అరెస్టు

14 మోటార్‌సైకిళ్లు స్వాధీనం

రాయచూరు రూరల్‌: జిల్లాలోని కవితాళ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బైక్‌ల దొంగను అరెస్టు చేసి చోరీకి గురైన 14 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్‌ నాయక్‌ వెల్లడించారు. శనివారం కవితాళ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బైక్‌ల చోరీ కేసుల దర్యాప్తు చేపట్టిన కవితాళ పోలీసులు బళగానూరుకు చెందిన దొడ్డ బసవ అనే నిందితుడిని అరెస్ట్‌ చేసి అతని నుంచి ద్విచక్రవాహనాలను జప్తు చేసినట్లు తెలిపారు.

వేసవిలో పని వేళలు తగ్గించాలి

హొసపేటె: వేసవి ఎండల నేపథ్యంలో కూలీ కార్మికులకు 30 శాతం పని వేళలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం తాలూకాలోని డణనాయకన కెరె వద్ద ఏర్పాటు చేసిన కూలీ కార్మికుల దినోత్సవంలో గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యకర్త షహనాజ్‌ మాట్లాడారు. జిల్లాలో అధిక వేడి కారణంగా పనిని 30 శాతం మేర తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్‌ఆర్‌ఈజీఏ కార్మికులు హైదరాబాద్‌ కర్ణాటక జిల్లాల్లో పని చేస్తున్నారు. ప్రతి ఏటా అధిక వేడి కారణంగా పని 30 శాతం తగ్గుతూ వచ్చింది. కానీ ఈ ఏడాది పని తగ్గించాలన్న ఉత్తర్వులు ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరారు. మంత్రి ప్రియాంక ఖర్గేను కోరుతూ లేఖల ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. అంతేకాకుండా ఈ ఏడాది కార్యాచరణ ప్రణాళికకు ఇంకా ఆమోదం లభించనందున కార్మికులకు పని దొరకడం లేదన్నారు. ఈ నేపథ్యంలో కార్యాచరణ ప్రణాళికను తక్షణమే ఆమోదించాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. నరేగ వేతన కార్మికులు కే.కూటన్న, తిండప్ప, రమాలి, భీమప్ప, రమేష్‌, వెంకటేష్‌, లక్ష్మీ, నబీసాబ్‌, యల్లమ్మ, గంగమ్మ, సువర్ణ, దేవక్క, కాళమ్మ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement