హొసపేటె: ప్రపంచానికి శాంతి, అహింస, కరుణ సందేశాన్ని అందించిన బుద్ధ జయంతి వేడుకలు కేవలం ఒక సంప్రదాయంగా మాత్రమే మిగిలిపోకూడదు. మనం బుద్ధుని బోధనలను, ఆదర్శాలను మన వ్యక్తిగత జీవితాల్లో అలవర్చుకోవాలి. శాంతిని సరైన మార్గంలో అనుసరించినప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఈ.బాలకృష్ణ అన్నారు. శనివారం నగరంలోని జెడ్పీ కార్యాలయ హాలులో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ, సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ బుద్ధ జయంతి కార్యక్రమంలో బుద్ధుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేటి ప్రపంచ సంఘర్షణలు, అంతర్గత విభేదాలు, దేశంలోని సామాజిక సమస్యలను పరిష్కరించడంలో బుద్ధుని ఆలోచనలు అత్యంత సందర్భోచితమైనవన్నారు. రాజకుటుంబంలో జన్మించి, అన్ని సుఖాలు, సౌభాగ్యాలు అనుభవించిన సిద్ధార్థుడు సమాజ పరివర్తన కోసం వాటన్నింటినీ త్యజించి బుద్ధుడయ్యాడు. ఆయన ఆలోచనలు దేశ విదేశాలకు వ్యాపించాయి. నేడు మానవుల్లో బీపీ, షుగర్, ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలకు మితిమీరిన కోరిక, దురాశలే ప్రధాన కారణాలు. పొరుగువారితో కలహాలు లేదా భూమిపై దురాశ, ఇవన్ని మనల్ని శాంతికి దూరం చేస్తున్నాయి. చక్రవర్తి అశోకుడు బుద్ధుని శాంతి సందేశంతో ప్రభావితుడై బౌద్ధమతాన్ని వ్యాప్తి చేశాడు. నేటికీ మన జాతీయ పతాకంలో దానికి గౌరవం లభిస్తోంది. ఈ విషయంలో ఆయన, బుద్ధుని ఆలోచనలను కేవలం వినడమే కాకుండా వాటిని మన జీవితాల్లో ఆచరించడం వల్ల మన జీవితానికి అర్థాన్నిస్తుందని అన్నారు. ఉపన్యాసకురాలు డాక్టర్ ఉమా, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వైఏ కాళె, తహసీల్దార్ ఎం.శృతి, జెడ్పీ సీఈఓ అన్నదాన స్వామి, సంఘ నాయకుడు సోమశేఖర్ సంగమని, ఇతరులు హాజరయ్యారు.


