రేషన్‌ బియ్యం దందాపై కొరడా | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం దందాపై కొరడా

Apr 23 2026 7:54 AM | Updated on Apr 23 2026 7:54 AM

సాక్షి,బళ్లారి: పేదలకు ఉచితంగా బియ్యం అందించి వారి కడుపు నింపాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలు నీరుగారుతున్నాయి. పేదలకు రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా అందించే రేషన్‌ బియ్యాన్ని యధేచ్ఛగా పక్కదారి పట్టిస్తూ అక్రమంగా రవాణా చేస్తున్నారు. కర్ణాటకలో బీపీఎల్‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు కేజీలు, కేంద్ర ప్రభుత్వం ఐదు కేజీల చొప్పున 10 కేజీల బియ్యం అందిస్తున్నారు. పేదలు మూడు పూటలా భోజనం తినాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఉచిత రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకే లబ్ధిదారులతో కొనుగోలు చేసి, భారీ ఎత్తున అక్రమంగా దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. బళ్లారి జిల్లాతో పాటు ఉత్తర కర్ణాటక పరిధిలో ఏదో ఒక జిల్లాలో ఎక్కడో ఒక చోట ప్రతి నెలా పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు.

తరచు నిజాయితీ అధికారుల దాడులు

అక్కడక్కడ ఇలా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని నిజాయితీగల అఽధికారులు పట్టుకుంటున్నా రేషన్‌ బియ్యం అక్రమ దందా ప్రతి నెలా కొనసాగుతూనే ఉంది. బుధవారం బళ్లారి జిల్లా కురుగోడు పోలీసు స్టేషన్‌ పరిధిలోని కంప్లి తాలూకా నెల్లుడి గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 20 టన్నుల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనికి చెందిన షెక్షావలి, మాన్వి తాలూకాకు చెందిన వీరభద్ర అనే వ్యక్తులు రేషన్‌ బియ్యాన్ని రవాణా చేస్తున్న సమయంలో కురుగోడు పోలీసులకు సమాచారం అందడంతో వల పన్ని పట్టుకున్నారు. పోలీసులతో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా దాడి చేసి సోదాలు చేపట్టి అక్రమ రేషన్‌ బియ్యం రవాణాను గుట్టురట్టు చేశారు.

రూ.90 వేల విలువ చేసే బియ్యం జప్తు

దాదాపు రూ.90 వేల విలువ చేసే బియ్యాన్ని పట్టుకోవడంతో పాటు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఇలా రేషన్‌ బియ్యం జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఏదో ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న వాటిని పోలీసులు, సంబంధిత అధికారులు పట్టుకుంటూనే ఉన్నారు. జిల్లాలో ప్రతి నెలా రేషన్‌ బియ్యం 20వ తేదీ నుంచి లబ్ధిదారులకు ఇవ్వడం ప్రారంభిస్తారు. లబ్ధిదారులకు బియ్యం అందించిన వెంటనే దళారులు, వ్యాపారులు రంగ ప్రవేశం చేస్తారు. రేషన్‌ బియ్యం లబ్ధిదారుల నుంచి కిలో బియ్యాన్ని రూ.10లకే కొనుగోలు చేసి రవాణా చేస్తున్నారు. బీపీఎల్‌ కార్డుదారులకు ఉచితంగా బియ్యం అందిస్తున్న నేపథ్యంలో సగానికి సగం మంది రేషన్‌కార్డులు ఉన్న వారు అమ్ముతుండటంతోనే ఈ రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

కార్డు లబ్ధిదారుల నుంచి

కేజీ రూ.10లకే కొనుగోళ్లు

ప్రతి నెల యధేచ్ఛగా చౌకడిపో

బియ్యం అక్రమ రవాణా

Advertisement
 
Advertisement
Advertisement