బళ్లారిటౌన్: రానున్న 2029 లోక్‌సభ ఎన్నికల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల చట్టసభల్లో మహిళా శక్తి మరింత పెంపొందనుందని ఎమ్మెల్సీ హేమలతా నాయక్ పేర్కొన్నారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘనత అని పేర్కొన్నారు. ఇది మహిళలను ఎంతో ఉత్తేజ పరిచిందన్నారు. నేటి నుంచి పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాలను ఇందు కోసమే ఏర్పాటు చేశారని, ఇది అమలు కావడం ఖాయమన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టంపై లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల్లో అనేక సార్లు చర్చలు జరిపినప్పటికీ అమలు కాలేదన్నారు. ప్రస్తుతం పార్లమెంట్, అసెంబ్లీల్లో రిజర్వేషన్ల శాతం పెంచితే ఎంతో మంది రాజకీయాల్లో కష్టపడిన మహిళలకు అవకాశాలు లభిస్తాయన్నారు. ఇంతకు ముందు పార్లమెంట్‌లో 4 శాతం మాత్రమే మహిళలు ఉండేవారన్నారు. 2019లో 15 శాతానికి పెరిగిందని, ఇక రానున్న 2029లో 33 శాతానికి పెరిగితే మహిళలకు మరింత శక్తి పెరగనుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారావధిలో డ్రోన్ డీబీ, ముద్రా లోన్ వంటి అనేక పథకాల వల్ల ఎంతో మంది మహిళలు అభివృద్ధి చెందారన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. పార్టీ మహిళా నాయకురాలు సుధా విజయలక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు హంపీ రమణ, ప్రముఖులు అరుణ కామినేని, విజయ లక్ష్మి, రేణుకా, అలివేలు, సుగుణ, సాధన హిరేమఠ తదితరులు పాల్గొన్నారు.


