సాక్షి, బళ్లారి: ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమైంది. 1 నుంచి 10వ తరగతి వరకు చదివిన ప్రతి విద్యార్థి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు అంటేనే ఉత్కంఠత, టెన్షన్ టెన్షన్‌గా ఉంటుంది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 10 తరగతి పరీక్షలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా 65 పరీక్ష కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. జిల్లాలో 23 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి రోజు ఉత్కంఠగా పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పరీక్ష కేంద్రాల వద్దకు వచ్చి ఆయా పరీక్ష కేంద్రాల వద్ద తమ పిల్లలకు ధైర్యం చెప్పి బాగా రాయాలని ఆశీర్వదించారు.
విద్యార్థులకు ధైర్యం నూరిపోత
ఎలాంటి టెన్షన్‌కు లోనుకాకుండా పరీక్షలు రాయాలని ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రాల లోపలకు పంపించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆయా సెంటర్లలో విద్యార్థులకు ఏయే తరగతి గదిలో నెంబర్లను కేటాయించారన్న దానిపై నెంబర్ల బోర్డు ఉంచడంతో తమకు ఏ గదికి కేటాయించారో విద్యార్థులు ఆత్రుతగా నెంబర్లను సరిచూసుకుని తమకు కేటాయించిన తరగతి గదిలోకి వెళ్లారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో అన్ని కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తును నిర్వహించారు. మొదటి రోజు పరీక్షలు ముగిసిన తర్వాత పరీక్ష కేంద్రాల వద్దకు ఆయా స్కూళ్లకు సంబంధించి యాజమాన్యాలు, బంధువులు, విద్యార్థుల వద్దకు వచ్చి పరీక్షకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొన్నారు.
పది పరీక్ష కేంద్రాల తనిఖీ
రాయచూరు రూరల్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రఽశాంతంగా జరిగాయి. టాగూర్ స్మారక ఉన్నత పాఠశాలలో మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్, జిల్లాధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, విద్యాశాఖాధికారి బడిగేర్, తాలూకా విద్యాశాఖాధికారులు ఈరణ్ణ, చంద్రశేఖర్, సుఖదేవ్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో 110 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 32,086 మంది విద్యార్థులకు గాను 814 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యా శాఖాధికారి బడిగేర్ తెలిపారు.
విజయనగరలో...
హొసపేటె: విజయనగర జిల్లా వ్యాప్తంగా 73 కేంద్రాల్లో 22,041 మంది విద్యార్థులు బుధవారం మొదటి రోజు ప్రథమ భాష పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల చుట్టు నిషేధాజ్ఞలు అమలు చేశారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులను జిల్లా యంత్రాంగం సమకూర్చింది. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
టెన్షన్ టెన్షన్‌గా పరీక్ష
కేంద్రాలకు చేరిక
23 వేల మందికి పైగా విద్యార్థుల హాజరు


