రాయచూరు రూరల్: కర్ణాటక రత్న, కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ సామాజిక సేవలు అభినందనీయమని డాక్టర్ రాజ్‌కుమార్ అభిమానుల సంఘం జిల్లాధ్యక్షుడు గోవిందు పేర్కొన్నారు. నగరంలోని కర్ణాటక సంఘంలో సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కత్తిరించి పేదలకు అన్నదానం ప్రారంభించి ఆయన మాట్లాడారు. తాను బతికి ఉన్నంత వరకు పునీత్ రాజ్‌కుమార్ అనాథ పిల్లలకు గుప్తంగా ఎంతో సేవలు చేశారన్నారు.
కొత్త డీసీపీగా
శృతి నియామకం
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ కమిషన్‌రేట్ అపరాధ, న్యాయ భద్రత విభాగం నూతన డీసీపీగా శృతి ఎన్‌ఎస్‌ను ప్రభుత్వం నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర నిఘా విభాగం ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆమెను మంగళవారం డీసీపీ పోస్టుకు బదిలీ చేసింది. ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న మహానింగ నందగావి ఇటీవల బదిలీపై వెళ్లారు. 2019 ఐపీఎస్ ర్యాంక్ అధికారిణి అయిన శృతి ఇంతకు ముందు చిక్కమగళూరు, బెళగావి జిల్లాల్లో ఏఎస్పీగా విధులు నిర్వహించారు. కాగా ఈమె త్వరలో సదరు బాధ్యతలను చేపట్టనున్నారు.
ట్రాక్టర్ కింద పడి
డ్రైవర్ మృత్యువాత
సాక్షి బళ్లారి: ఇటుకలతో నిండిన ట్రాక్టర్‌ను తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి చెందాడు. హావేరి జిల్లా మరోళు గ్రామంలో గుప్తలతాండా నివాసి దేవరాజ్(26) అనే వ్యక్తి ట్రాక్టర్ ట్రాలీలో నిండుగా ఇటుకలను తీసుకెళ్తున్న సమయంలో ఉన్నఫళంగా ట్రాలీ పైకిలేవడంతో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఎయిడ్స్‌పై ముమ్మర ప్రచారం చేపట్టాలి
రాయచూరు రూరల్: దేశాన్ని పట్టిపీడిస్తున్న ఎయిడ్స్‌పై ముమ్మర ప్రచారం చేపట్టాలని ప్రభుత్వ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు దండెప్ప పేర్కొన్నారు. బుధవారం ఉడుంగల్ ఖానాపూర్ ప్రభుత్వ హైస్కూలులో ఆరోగ్య శాఖ, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఎయిడ్స్ జాగృతి జాతానుద్దేశించి మాట్లాడారు. సమాజంలో ఈ వ్యాధికి గురైన వారిపై వివక్ష తగదని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఎయిడ్స్ వ్యాధిపై గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో నలుగురితో సమానంగా జీవించాలన్నారు.
మంత్రిని అవమానించడం తగదు
రాయచూరు రూరల్: రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి హెచ్‌సీ మహదేవప్పను మాజీ మంత్రి శివన గౌడ నాయక్ అవమానించడం తగదని కర్ణాటక చలువాది జిల్లా మహాసభ సంచాలకుడు విశ్వనాథ్ పట్టి ఆరోపించారు. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళననుద్దేశించి ఆయన మాట్లాడారు. ఇటీవల దావణగెరెలో ఎస్సీ, ఎస్టీ నాయకుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారని, అలాంటి నాయకులను చెంప పగలగొట్టాలని వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. మాజీ మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్నా పనికిమాలిన మాటలు మాట్లాడటం తగదన్నారు. మంత్రిని నిందించిన మాజీ మంత్రిని అరెస్ట్ చేయాలని కోరుతూ అదనపు ఎస్పీ కుమారస్వామికి వినతిపత్రం సమర్పించారు.
విద్యార్థులు స్వయంకృషితో ఎదగాలి
రాయచూరు రూరల్ : సమాజంలో విద్యార్థులు స్వయంకృషితో ముందుకు రావాలని డయట్ అధ్యాపకుడు సుఖదేవ్ అన్నారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో సాంఘీక సంక్షేమ ఽశాఖ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల గ్రామీణాభివృద్ధి స్వయం శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు మానసికంగా, ఆర్థికంగా, సాంఘీకంగా అభివృద్ధి చెందడానికి వీలు ఉంటుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.


