నత్తనడకన బైపాస్‌ రోడ్డు పనులు | - | Sakshi
Sakshi News home page

నత్తనడకన బైపాస్‌ రోడ్డు పనులు

Mar 19 2026 8:25 AM | Updated on Mar 19 2026 8:25 AM

బళ్లారిటౌన్‌: బళ్లారి నగర శివార్లలో అనంతపురం రోడ్డు నుంచి సిరుగుప్ప రోడ్డు వరకు చేపడుతున్న బైపాస్‌ రహదారి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్న ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయా? అని నగర వాసులు ఎదురు చూస్తున్నారు. ఈ పనులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేకి చెందిన కంపెనీ నిర్వహిస్తున్నందున ఈ పనులు కూడా సబ్‌ కాంట్రాక్ట్‌ ద్వారా నిర్వహిస్తుండటం వల్ల నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రశ్నార్థకంగా రోడ్డు నాణ్యత

ముఖ్యంగా రోడ్డుకు వేసే గ్రావెల్‌ను పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వేస్తున్నారు. ఈ మట్టి బంక మట్టి కావడంతో మున్ముందు రోడ్డు ఎంత వరకు నాణ్యతగా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. అంతేగాక ఇటీవల ఈ మట్టిని కూడా నియమాలను ఉల్లంఘించి ఇక్కడికి తీసుకొస్తున్నందున స్థానిక అధికారులు కూడా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పలు సబ్‌ కాంట్రాక్టర్లు చేసిన పనులకు సరైన విధంగా నిధులు సమకూర్చక పోవడంతో పనులు నాసిరకంతో పాటు జాప్యం జరుగుతోందని పలువురు వాదిస్తున్నారు. ఇప్పటికే అనంతపురం రోడ్డు నుంచి రైల్వే ట్రాక్‌ వరకు కొంత వరకు పనులు చురుకుగా జరిగిన అక్కడి నుంచి సిరుగుప్ప రోడ్డు వరకు చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఏడాదిన్నరలోగా పనుల పూర్తికి ఆదేశం

ఈ పనులు ఒకటిన్నర సంవత్సరంలోపు పూర్తి చేయాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ ఇప్పటికే పనులు ప్రారంభించి సంవత్సరం పైబడింది. ఇంకా చాలా చోట్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. వీటికి ప్రస్తుతం ముందస్తు వర్షాలు కురుస్తున్నందున ఈ పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎండాకాలంలో పనులు పూర్తి చేస్తే వర్షాకాలంలో కొంత వరకు మేలు కలగవచ్చు. ఈ రోడ్డు పనుల వల్ల కొన్ని కాలనీలకు రాకపోకలు స్తంభించి పోవడంతో ఆయా కాలనీల వాసులు కూడా ఈ రోడ్డు ఎప్పుడు పూర్తవుతాయా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

ఇంత పెద్ద స్థాయి పనులు జరుగుతున్నా నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు సరిగ్గా పర్యవేక్షణ చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పని చేయాలన్న నేషనల్‌ హైవే అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఏదో నామమాత్రంగా తనిఖీలు చేస్తుండటంతో పనుల్లో నాణ్యత లోపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు సక్రమంగా పర్యవేక్షించి పనులను చురుగ్గా సాగేలా చర్యలు చేపట్టాలని పలు సంఘ సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ రోడ్డు పనులు త్వరగా పూర్తయితే భారీ వాహనాలు నగరంలోకి రాకుండా ఊరి బయట నుంచే వెళ్లేందుకు ఎంతో దోహదపడుతుందని వారు వాదిస్తున్నారు.

పనులు ఎప్పుడు పూర్తవుతాయా? అని ఎదురు చూపులు

నాసిరకంగా పనులు చేస్తున్నారని వెల్లువెత్తిన ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement