హుబ్లీ: ఉత్తర కర్ణాటకలో వివిధ జిల్లాల్లో మంగళవారం వడగళ్ల వాన కురవడంతో కొన్ని పంటలను నష్టపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మామిడి, దానిమ్మ తదితర పంటలకు హాని వాటిల్లిందని రైతులు వాపోయారు. జిల్లాలోని నవలగుంద తాలూకాలో వడగళ్ల వాన ఫలితంగా అంతోఇంతో మిగిలిన జొన్న, గోధుమ పంటలకు హాని వాటిల్లింది. దాసనాళలో భారీ వర్షాలకు పిడుగు పడి గేదె మృతి చెందింది. బోగనూరులో ఓ వృక్షం ఇంటిపై కూలగా ఎటువంటి ప్రాణహాని జరగలేదు. గాలి మరలు కూలిపడటంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. కొందరు రైతుల కుసుమ పంట ఇంకా పొలంలో ఉన్నందు వల్ల చేతికొచ్చిన పంట నోటిదాకా వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. గదగ్ జిల్లా రోణలో వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది.
పశుగ్రాసానికి దెబ్బ
ముఖ్యంగా పశుగ్రాసం, వేరుశెనగ పొట్టు నీటి పాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయపుర జిల్లా ముద్దేబిహాళ, నిడగుంది, బసవన బాగేవాడి, కోల్హార, ముళవాడల్లో తీవ్ర వర్షాలతో ద్రాక్ష, దానిమ్మ తదితర పంటలకు హాని వాటిల్లింది. మామిడి సాగుపై కూడా ఈ వాన తీవ్ర ప్రభావం చూపింది. మామిడికి తెగులు బాధలు తప్పవని, ఫలితంగా దిగుబడి తగ్గవచ్చని సంబంధిత వ్యవసాయ, వాతావరణ శాఖ అధికారి రవి పాటిల్ తెలిపారు. మొత్తానికి జిల్లాలో ఈ వాన ఎండల నుంచి కాసింత ఉపశమనం కలిగించినా ఎన్నడూ లేని విధంగా కలఘటిగి, కుందగోళ తదితర చోట్ల పలు పంటలకు వివిధ రకాలుగా హాని కల్గించింది.
రాయచూరు జిల్లాలో..
రాయచూరు రూరల్: జిల్లాలో మంగళఽవారం సాయంత్రం వడగళ్ల వానలు కురిశాయి. దేవదుర్గ తాలూకా గలగ, మస్కి, మాన్వి తాలూకా కవితాళ, లింగసూగూరు తాలూకా గురుగుంట, హట్టి, పామన కల్లూరుల్లో భారీ వానలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో వరి, పత్తి పంటలు దెబ్బ తిన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు వడగళ్లను ప్లాస్టిక్ గంపల్లో పట్టుకొని ఆడుకున్నారు. మెదికినాళలో వరి పంట దెబ్బతింది.


