ఇంటింటా ఘనంగా సంక్రాంతి
బొమ్మనహళ్లి : కొత్త ఏడాది తొలి పెద్ద పండుగ సంక్రాంతి ఇంటింటా కాంతులు నింపింది. పొలాలనుంచి పంటలు ఇంటికొచ్చిన వేళ రైతన్నలు అత్యంత ఘనంగా నిర్వహించుకునే సంక్రాంతిని పల్లెవాసులతోపాటు నగరవాసులు కూడా ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. బుధవారం భోగి, గురువారం మకర సంక్రాంతి, శుక్రవారం కనుమను ఆచరించారు. ఇళ్ల ముందు ఆవు పేడనీళ్లతో కల్లాపి చల్లి గొబ్బెమ్మలు ఉంచి పూలతో అలంకరించారు. ఇంటిల్లిపాది ఉదయాన్నే స్నానాలు ఆచరించి కొత్త దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి పూజలు చేసి పిండివంటలు చేసుకొని కుటుంబ సమేతంగా ఆరగించారు. బంధువులు, స్నేహితులు రావడంతో ప్రతి ఇల్లు కళకళలాడింది. బెంగళూరు నగరంలోని బీటీఎం లేఔట్‌లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో రాష్ట్ర రవాణ శాఖ మంత్రి రామలింగారెడ్డి తన సతీమణి చాముండేశ్వరి, కుమార్తె, మాజీ ఎమ్మెల్యే, కేపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సౌమ్యారెడ్డితో కలిసి పాల్గొన్నారు. సూర్య దేవుడికి, గోవుకు పూజలు నిర్వహించారు. సుద్దగుంట పాళ్యవార్డు మాజీ కార్పొరేటర్ మంజునాథ్ అధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.సుబ్రహ్మణ్య స్వామి ఆవరణలో పూజలునిర్వహించారు. ఎడ్లను సంప్రదాయబద్దంగా అలంకరించారు. అడుగోడిలో సమాజ సేవకుడు ఎస్‌టీడీ మంజునాథ్ పేదలకు సంక్రాంతి కిట్లను ఆందజేశారు. కోరమంగళలోని కాంగ్రెస్ నాయకుడు వెంకటేశ్ ఆధ్వర్యంలో రంగోలి పోటిలు నిర్వహించారు. వడ్లు, రాగులు, రాసులుగా పోటి పేదలకు ఆందజేశారు. చెరుకు గడలు, నువ్వలు, బెల్లం పంపిణీచేశారు. సౌమ్య రెడ్డి, జీ.మంజునాథ్, అడుగొడిమోహన్, మంజులసంపత్ పాల్గొన్నారు.
బనశంకరి: జయనగర నాలుగో బ్లాక్ గణపతి ఆలయం వద్ద వీరవనిత ఒనక ఓబవ్వ డాక్టర్ రాజ్‌మంటప, కన్నడసేవా సమితి కన్నడకట్టె మాజీ బీబీఎంపీ సభ్యుడు ఎస్‌జీ.రమేశ్‌రాజు నేతృత్వంలో గోపూజ, మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. నువ్వులు, బెల్లం, చెరుకులు అందజేశారు.
బొమ్మనహళ్లి : ఎలక్ట్రానిక్ సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొన్నారు. ఎడ్లబండ్ల ఊరేగింపు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సింగర్స్ సమీరా భరద్వాజ్, నాగార్జున సినీ పాటలను ఆలపించి ఆకట్టుకున్నారు. జబర్దస్త్ టీమ్ చలాకీ చంటి, వెంకి నాగిరెడ్డి బృందం కామెడీ షో ప్రేక్షకులను అలరించింది.తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు రాధాకృష్ణరాజును ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ విల్లా, ప్రధాన కార్యదర్శి శంకర్, శేఖర్ శర్మ పాల్గొన్నారు.
బనశంకరి: కెంగేరిలో కనుమ సందర్భంగా శుక్రవారం రైతులు తమ పశువులు, గోవులు, ఎద్దులను అందంగా అలంకరించి గోపూజ నిర్వహించిన అనంతరం నిప్పులపై దాటించారు. సాయంత్రం గ్రామంలో ఎద్దులను ఊరేగించి సందడి చేశారు. బనశంకరీదేవి సన్నిధి భక్తులతో పోటెత్తింది. ఆలయ ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ బనశంకరీదేవి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేపట్టి చెరుకులు, నువ్వులు, కొబ్బరి, పప్పులు, బెల్లంతో బనశంకరీదేవికి విశేష అలంకరణ చేపట్టారు.
ఇంటింటా ఘనంగా సంక్రాంతి
ఇంటింటా ఘనంగా సంక్రాంతి


