వ్యక్తిపై చిరుత దాడి
దొడ్డబళ్లాపురం: వ్యక్తిపై చిరుత దాడి చేయగా బాధితుడు సమయస్పూర్తితో వ్యవహరించి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా కన్యాడి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంజప్ప నాయక్ తన ఇంటి బయట పని చేసుకుంటుండగా హఠాత్తుగా చిరుత దాడి చేసింది. కాలు అందిపుచ్చుకుని కొరికింది. మంజప్ప ధైర్యం చేసి వక్క చెట్టు ఎక్కి కూర్చున్నాడు. గ్రామస్తులు పరుగున రావడంతో చిరుత పరారైంది. గాయపడ్డ మంజప్పను తక్షణం తాలూకా ఆస్పత్రికి తరలించారు.
పట్టణంలో చైన్‌స్నాచింగ్
గౌరిబిదనూరు: పండుగ రోజున చైన్‌స్నాచర్లు తెగబడ్డారు. పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన మహిళ చంద్రలీల గురువారం ఉదయం పాల పాకెట్ కోసం వెళ్తుండగా పల్సర్ బైక్‌పై హెల్మెట్ ధరించి వచ్చిన దుండగులు ఆమె మెడలోని 50 గ్రాంల బంగారు గొలుసు లాగారు. అది తెగిపోయి దొంగల చేతికి 20 గ్రాముల చైన్ చిక్కడంతో ఉడాయించారు బాధితురాలి ఫిర్యాదుతో జిల్లా అడిషనల్ ఎస్పీ జగన్నాథ్, డీఎస్పీ ప్రకాశరెడ్డి, టౌన్ ఎస్‌ఐ గోపాల్, రూరల్ ఎస్‌ఐ రమేశ్ గుగ్గరి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. చైన్‌స్నాచర్ల కోసం గాలింపు చేపట్టారు.
లంచం డబ్బులో వాటా ఇవ్వండి
● తహసీల్దార్ ఆడియో వైరల్
దొడ్డబళ్లాపురం: కలబుర్గి జిల్లా జీవర్గి తహసీల్దార్ మల్లన్న యలగోడు లంచం డిమాండు చేసినట్లు ఆరోపణలపై ఆడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కిందస్థాయి అధికారులతో సమావేశమైన తహసీల్దార్ మట్లాడుతూ తన పేరు చెప్పుకునికొందరు లంచాలు తీసుకుంటున్నారని, ఆ డబ్బుల్లో తనకూ వాటా ఇవ్వాలని అడిగారు. ఇందుకు సంబంధించి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా మల్లన్న తీరుపై అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను ఎవరినీ లంచం అడగలేదని తహసీల్దార్ పేర్కొన్నారు.
బైక్‌ను ఢీకొన్న కారు..
ఐదుగురికి గాయాలు
దొడ్డబళ్లాపురం: కారు బైక్‌ను ఢీకొని ఐదుగురు గాయపడ్డారు. ఈఘటన గదగ్ జిల్లా లక్ష్మేశ్వర తాలూకా రామగిరిలో ఈప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గాల్లోకి ఎగిరి చెట్లపొదల్లోకి పడి గాయపడ్డారు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్య
యశవంతపుర: కుమార్తెతో కలిసి నేపాలీ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు సంజయనగర కృష్ణప్ప లేఔట్‌లో జరిగింది. నేపాల్‌కు చెందిన గోవిందు బహుద్దూరు, సీతా దంపతులు సంజయనగరలో నివాసం ఉంటూ ఓ ఇంటిలో పనిమనుషులుగా పనిచేస్తున్నారు. ఐదారు నెలల క్రితం గోవిందు నేపాల్‌కు వెళ్లాడు. భర్త తిరిగి రాకపోవడంతో సీతా తన కుమార్తెతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. సంజయనగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
గవిగంగాధేశ్వరునికి
సూర్యకిరణాల తాకిడి
యశవంతపుర: బెంగళూరు గవిపురంలో వెలసిన గుట్టహళ్లి గవిగంగాధరేశ్వర దేవస్థానంలోని శివలింగాన్ని సూర్య కిరణాలు తాకాయి. గురువారం సాయంత్రం 5:19 గంటలకు శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. కుడి వైపున కిటికీ ద్వారా శివలింగంపై కిరణాలు నంది కొమ్ము ద్వారా శివుడి గర్భగుడిలోని శివలింగంపై పడటాన్ని చూసి భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఈ సమయంలో శివ స్త్రోత్రాన్ని పఠించారు.
మంత్రికి తప్పిన ప్రమాదం
శివాజీనగర: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు పెను ప్రమాదం నుంచి బయట పడ్డారు. సంక్రాంతి సంబరాల నేపథ్యంలో చిక్కపేటలో ఉన్న బళేపేటలో ఆలయం ముందు గురువారం నిర్వహించి ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. రాత్రి 7 గంటల సమయంలో బాణసంచా పేల్చుతుండగా నిప్పు రవ్వలు బ్యానర్లు, తోరణాలపై పడి మంటలు చెలరేగాయి. నిర్వాహకులు అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో మంత్రితోపాటు భక్తులకు ప్రమాదం తప్పింది.
చిరుతను చంపిన వ్యక్తి అరెస్ట్
మైసూరు : పశువులను వేటాడిందని చిరుతకు విషం ఇచ్చి హతమార్చిన చామరాజనగర్ తాలూకా ఆలూర్ హోమ్మ గ్రామానికి చెందిన దొరెస్వామి (60) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం చిరుతపులి కళేబరం దొరెస్వామి పొలం సమీపంలోనే కనిపించింది. అటవీ అధికారులు పరిశీలించి విష ప్రభావంతో మృతి చెందినట్లు గుర్తించారు. దొరెస్వామిని అనుమానంతో విచారణ చేపట్టగా పశువులను హతమార్చుతుండటంతో చిరుతకు మాంసంలో విషం పెట్టి చంపినట్లు అంగీకరించాడు.
వ్యక్తిపై చిరుత దాడి


