స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో టోకరా
మైసూరు : వర్క్ ఫ్రం హోం ఉద్యోగంలో చేరిన ఒక మహిళ ఓ నకిలీ కంపెనీని నమ్మి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి రూ.9.7 లక్షలు కోల్పోయిన ఘటన మైసూరులో జరిగింది. మైసూరులోని రాజేంద్రనగర్‌లో నివసిస్తున్న బాధిత మహిళ సోషల్ మీడియాలో కనిపించిన ఒక ప్రకటనను గమనించింది. తర్వాత ఆమె ఇంటి నుంచే పని చేయడం ప్రారంభించి డబ్బు సంపాదించడానికి ఉద్యోగంలో చేరింది. మొదట ఆమెకు కంపెనీ నుంచి స్వల్ప జీతం వచ్చింది. తర్వాత అక్కడ కేటుగాళ్ల మాటలు నమ్మి, మరింత డబ్బు కోసం స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టింది. ఆ క్రమంలో ఆమె ఆ ఖాతాలో రూ.9.7 లక్షలు జమ చేసి మోసపోయింది. ఈ ఘటనపై మైసూరు సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
రాజలక్ష్మి దేవికి విశేష పూజలు
గౌరిబిదనూరు: తాలూకాలోని చిక్కకురుగోడు సమీపంలో కొలువైన రాజలక్ష్మి దేవి అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు నరేంద్ర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, అలంకరణలు, పూజలు నిర్వహించి మహామంగళహారతి ఇచ్చారు. అనంతరం గోపూజ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్నదానం జరిగింది.
చెక్ బౌన్స్ కేసులో నిందితునికి రూ.2.60 లక్షల జరిమానా
మైసూరు : చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి హుణసూరు జేఎంఎఫ్‌సీ సివిల్ కోర్టు రూ.2.60 లక్షల జరిమానా విధించింది. డబ్బు చెల్లించకపోతే 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. హుణసూరు నగరంలోని కల్కుణికె బరంగె నివాసి కె.కృష్ణ అనే ఫిర్యాదుదారుడు హెచ్.డీ.కోటె తాలూకాలోని వడ్డరగుడి నివాసి అశ్వత్‌కు రుణం రూపంలో ఇచ్చిన డబ్బుకు సెక్యూరిటీగా చెక్కు అందుకున్నాడు. సకాలంలో రుణం చెల్లించనందుకు చెక్కు బౌన్స్ అయినందున అతను సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశాడు. విచారణ చేసిన సీనియర్ సివిల్ జడ్జి భాగ్యమ్మ రుణగ్రహీత, నిందితుడు అశ్వత్‌కు రూ.2.60 లక్షల జరిమానా విధిస్తూ, నిర్ణీత గడువులోగా ఆ మొత్తం ఫిర్యాదుదారునికి చెల్లించకపోతే 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారుడు కే.కృష్ణ తరపున న్యాయవాది ఎం.ఆర్. హరీష్ ఈ కేసును వాదించారు.
ఆస్తి వివాదంతో ఒకరి హత్య
మండ్య: ఆస్తి వివాదంతో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. ఈఘటన తాలూకాలోని మాయప్పనహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన యోగేష్ (35), అతని అన్నయ్య లింగరాజు మధ్య కొంత కాలంగా ఆస్తి వివాదం నడుస్తోంది. శుక్రవారం మరోమారు గొడవ జరిగింది. ఓ దశలో యోగేష్‌పై అన్నయ్య, అతని కుమారులు భరత్, దర్శన్‌లు మారణాయుధాలతో దాడి చేసి నరికారు. కెరగోడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా హతుడు యోగేష్‌కు వివాహం నిశ్చయమైంది. వచ్చే బుధవారం వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే హత్యకు గురయ్యాడు.
నేత్రపర్వం.. లక్ష దీపోత్సవం
మండ్య : మండ్య జిల్లా శ్రీరంగ పట్టణంలోని వెలిసిన చారిత్రక శ్రీ రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో 36వ సంవత్సర లక్ష దీపోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆలయం ముందు నుంచి గండ భేరుండ సర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపులా వెదురు స్తంభాలపై వెలిగించిన దీపాలు దేదీప్యమానంగా వెలిగాయి. కమిటీ సభ్యులు వేద బ్రహ్మ డాక్టర్ భానుప్రకాష్, లక్ష్మి నేతత్వంలో ఆలయం ముందు హోమ హవనాన్ని నిర్వహించి పూజలు చేసిన తర్వాత దీపాలను వెలిగించారు. మకర సంక్రాంతి సందర్భంగా ప్రధాన పూజారి విజయసారథి నేతత్వంలో శ్రీ రంగనాథ స్వామిని వెన్నతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించి నైవేద్యాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు క్యూలైన్లలో నిల్చొని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన స్వర్గ ద్వారం గుండా నడిచి స్వామివారిని దర్శించుకున్నారు.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో టోకరా
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో టోకరా


