వాచీని చోరీ చేసి ఫొటో వాట్సాప్ స్టేటస్‌లో...
బనశంకరి: ఇంటి యజమాని గడియారాన్ని కాజేసిన పనిమనిషి ఆ ఫొటోను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకొని పట్టుబడింది. ఈ ఘటన సర్జాపురలో చోటుచేసుకుంది. సర్జాపురరోడ్డు అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న ప్రైవేటు కంపెనీ సీనియర్ మేనేజర్ రోహిత్ ఇంట్లో సౌమ్య అనే మహిళ పనిమనిషిగా ఉంది. డిసెంబరు 8వ తేదీ 42 గ్రాముల బంగారు మంగళసూత్రం, జత కమ్మలు, మైకెల్ కోర్సుబ్రాండెడ్ గడియారం కనిపించకపోవడంతో రోహిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పనిమనిషిని విచారణ చేపట్టగా తనకేమీ తెలియదని పేర్కొంది. అయితే సౌమ్య ఆ వాచ్ ధరించి ఫొటోను స్టేటస్‌లో పెట్టుకుంది. రోహిత్ గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా సౌమ్యాను అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీకరించడంతో రూ.4.5 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, రూ.20వేల విలువైన వాచీని ఆమెనుంచి స్వాధీనం చేసుకున్నారు.
పాత కక్షలతో స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య
మైసూరు: పాత కక్షలతో ఒక వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి చంపిన సంఘటన జిల్లాలోని సరగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మోలేయూర్ నివాసి రమేష్ అలియాస్ కరియప్ప (33)ను అతని స్నేహితుడు అనురాజ్ వచ్చి తన వెంట తెచ్చిన చాకుతో కడుపులో పొడిచి చంపాడు. అడవి జంతువులు లోపలికి రాకుండా వరి పొలాన్ని కాపలా కాస్తుండగా, అనురాజ్‌కు ఫోన్ చేసి రమేష్ గట్టిగా తిట్టాడు. దీంతో అనురాజ్ పొలంలో నిద్రిస్తున్న రమేష్ దగ్గరకు వెళ్లి కత్తితో పొడవడంతో రమేష్‌కు రక్తస్రావమై మరణించాడని పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి, ఏఎస్పీ రాజు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రసన్న, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆర్.కిరణ్, సిబ్బంది మహ్మద్ ఇమ్రాన్, ఆనంద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై సరగూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.


