ఫిర్యాదులకు టెక్ హంగు
సాక్షి, బెంగళూరు: సామాన్య ప్రజలు ప్రభుత్వ సేవలను పొందాలంటే ఎంతో కష్టం. కాళ్లరిగేలా తిరిగినా పనులు జరిగేది అనుమానమే. పై అధికారులు ఎవరో, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. చెప్పుకున్నా అవి ఎప్పటికీ పరిష్కారం అవుతాయో, అసలు తాము ఇచ్చిన ఫిర్యాదు ఏ దశలో ఉందో, ఏ అధికారి వద్ద నిలిచిపోయిందో వంటి సమాచారం ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నూతన సాంకేతిక వ్యవస్థను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
ఎలా పనిచేస్తుందంటే..
2021 నుంచి సమగ్ర ప్రజా సమస్యల నివారణ వ్యవస్థ (ఐపీజీఆర్‌ఎస్)ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రస్తుత ఈ వ్యవస్థ ద్వారా వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఫిర్యాదులు చేయవచ్చు. ప్రస్తుతం కొత్తగా తీసుకురానున్న విధానం వల్ల ప్రజలు కేవలం తమ పేరు, చిరునామా, సమస్య స్వరూపం వంటి కొద్దిపాటి సమాచారం ఇస్తే చాలు, ఏఐ ద్వారా స్వయంగా ఫిర్యాదు లేఖను రాసుకుని సంబంధిత అధికారికి పంపిస్తుంది. చదువు రాని వారు కూడా సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. మాటల రూపంలో సమస్యను వివరించినా చాలా ఫిర్యాదు నేరుగా సంబంధిత అధికారికి వెళ్లేలా చేస్తుంది. ఇది కన్నడ, ఇంగ్లిష్ రెండు భాషల్లో అందుబాటులోకి వస్తోంది. ఏడు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే అది స్వయంగా ఉన్నతాధికారికి ఆ ఫిర్యాదును పంపిస్తుంది. నిర్ణీత ఫిర్యాదు పరిష్కారానికి గరిష్ట కాల పరిమితిని 21 రోజులుగా నిర్ణయించారు. కింది స్థాయి ఉద్యోగి సమస్యను పరిష్కరించలేకపోతే ఎనిమిదో రోజు స్వయంగా ఆ ఫిర్యాదును సీనియర్ అదికారికి బదిలీ చేస్తుంది. ఇక్కడ కూడా మరో ఏడు రోజుల గరిష్ట కాల పరిమితి ఉంటుంది. ఇలా మొత్తంగా 21 రోజుల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూస్తారు. ఈ వ్యవస్థ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది. వచ్చే నెలలో ఈ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తున్నారు.
సత్వర పరిష్కారానికి
ఏఐ సహాయం
రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు
డిసెంబరు నుంచి
అమలులోకి?
సులభతరం కానుందా?
నీటి సరఫరా, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, పాడైపోయిన రోడ్లు, ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం, అలసత్వం తదితర సమస్యలపై ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడం సులభతరం కానుంది.
కర్ణాటక ఈ–గవర్నెన్స్ సెంటర్ త్వరలో ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత గ్రీవెన్స్ సెల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఈ కొత్త వ్యవస్థ డిసెంబర్ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.


