ఆపరేషన్ టైగర్ సంపూర్ణం
● తల్లి, మూడు పిల్ల పులుల పట్టివేత
మైసూరు: చామరాజనగర – మైసూరు జిల్లాల సరిహద్దుల్లో గుండ్లుపేటె తాలూకాలోని కల్లహళ్ళి వద్ద ఆపరేషన్ టైగర్ పూర్తయింది. ఒక తల్లి పులి, దాని మూడు పిల్లలను అటవీ సిబ్బంది బంధించారు. అనేక రోజుల నుంచి ఈ పులి పరిసర గ్రామాల వద్ద తిరుగుతూ ఆవులు, మేకలు వంటివాటిని చంపి తింటోంది. రైతులు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. గుండ్లుపేటె, కల్ళహళ్ళి, పడగూరు చుట్టుపక్కల గ్రామాల్లో వణుకు ఏర్పడింది.
ఏనుగులు, కెమెరాలు, డ్రోన్లు
గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు కార్యాచరణను ప్రారంభించారు. అనేక ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలను అమర్చారు. బండీపుర పరిధిలో పులుల జాడ తెలిసింది. పెంపుడు ఏనుగులు భీమా, మహేంద్ర, సుగ్రీవ, లక్ష్మణ్‌తో కలిసి పలు జిల్లాల అటవీ అధికారులు, సిబ్బంది డ్రోన్లతో అన్వేషణ సాగింది. గత వారం రోజుల్లో తల్లి పులి, పిల్ల పులులను బంధించారు. తల్లి వయసు నాలుగైదేళ్లు ఉంటుందని అంచనా వేశారు. పిల్లల వయసు 2 నెలలు ఉంటుంది. పులి కుటుంబాన్ని బండీపుర అరణ్యంలోకి తరలించారు. గ్రామాలవాసులు పులి పీడ విరగడైందని ఊపిరి పీల్చుకున్నారు.
కొడుకును కాపాడబోతే..
తల్లి హత్య
శివమొగ్గ: వడ్డీ వ్యాపారుల దాడిలో కొడుకును కాపాడబోయి మహిళ హత్యకు గురైంది. శివమొగ్గ తాలూకాలోని దుమ్మళ్ళి గ్రామంలోని సిదేశ్వర నగరలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గంగమ్మ (45), ఇంటి ఎదురుగా హరీష్ నాయక్, నాగేష్ నాయక్ అనే సోదరులుఉన్నారు, వీరు వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. గంగమ్మ కొడుకు మంజునాథ్‌కు గతంలో కొంత అప్పు ఇచ్చినట్లు సమాచారం, దానిని చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆదివారం రాత్రి 11 గంటలకు ఇదే విషయమై మంజునాథ్‌తో గొడవపడ్డారు. కొడవలి తీసుకుని అతన్ని నరకబోయారు, ఈసమయంలో కొడుకును కాపాడాలని తల్లి గంగమ్మ అడ్డువచ్చింది. ఆమెకు కొడవలి తగలడంతో ఘటనాస్థలిలోనే చనిపోయింది. తుంగా నగర పోలీసులు పరిశీలించి అన్నదమ్ములను అరెస్టు చేశారు.


