భర్త నుంచి హెచ్‌ఐవీ.. కొడుకును చంపి భార్య ఆత్మహత్య
హోసూరు: సంతోషంగా సాగిపోతున్న కుటుంబంలో భర్త వల్ల చిచ్చు చెలరేగింది. అతనికి హెచ్‌ఐవీ రావడం భార్య, కొడుకు ప్రాణాలను బలిగొంది. కొడుకును హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకొన్న ఘటన సిఫ్‌కాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి, హోసూరు పట్టణంలో ఓ వ్యక్తి (44) ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నాడు, ఇతనికి భార్య (40), కూతురు, 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్ని నెలల క్రితం అతనికి అనారోగ్యం రావడంతో ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు, హెచ్‌ఐవి వ్యాపించినట్లు వైద్యులు తెలిపారు. అవాక్కైన భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించుకొన్నారు. వీరిలో బాలిక బాగానే ఉంది, తల్లి కొడుక్కి హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఆమెకు పిడుగుపడినట్ల అయ్యింది. ఇకపై తాము సమాజంలో జీవించలేమని భయాందోళనకు గురై, శనివారం అర్ధరాత్రి నిద్రపోతున్న కుమారున్ని తలదిండుతో నొక్కి హత్య చేసి, తాను చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఉదయం నిద్రలేచిన కుమార్తె చూసి కేకలు వేసింది. స్థానిక ప్రజలు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. సిప్‌కాట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా చేరుకొని మృతదేహాలను స్వాధీనపరుచుకొని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
హెచ్‌ఐవీకి భయపడవద్దు
ఆమెది తొందరపాటు నిర్ణయమని, ఇంకా పలు రకాల పరీక్షలు చేసిన తరువాతే హెచ్‌ఐవీ, ఎయిడ్స్ ఉన్నది లేనిదీ నిర్ధారించాలని జిల్లా ఎయిడ్స్ విభాగం అధికారులు తెలిపారు. హెచ్‌ఐవీ వచ్చినంత మాత్రాన భయపడవద్దని, మంచి మందులు వాడుతూ ఆరోగ్యకర జీవనాన్ని కొనసాగించవచ్చని తెలిపారు.
హోసూరులో ఘోరం


