బాలల అక్రమ దత్తత నేరం
బళ్లారిటౌన్: బాలల అక్రమ దత్తత ప్రక్రియలో పాల్గొనడం నేరం అని జిల్లా న్యాయ సేవా ప్రాధికారం కార్యదర్శి సివిల్ న్యాయమూర్తి రాజేష్ ఎన్.హొసమనె పేర్కొన్నారు. అంతర్జాతీయ దత్తత మాసాచరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా పాలన యంత్రాంగం, న్యాయ సేవా ప్రాధికార తదితర శాఖల ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ ఏపీజే అబ్దుల్ ఆజాద్ వసతి పాఠశాల ఏర్పాటు చేసిన జాగృతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించాల్సి ఉంటుందన్నారు. మానవ జీవితం అమూల్యమైందని, ఏ కారణం చేతనైనా తల్లిదండ్రులు నవజాత శిశువులను వదిలి వెళ్లడం కనిపిస్తే జిల్లా బాలల రక్షణ శాఖ దృష్టికి తేవాలన్నారు. అటువంటి పిల్లలను రక్షించి వారిని మంచి కుటుంబంలోకి దత్తత ఇవ్వడంతో మంచి జీవితం కొనసాగించవచ్చన్నారు. పేద కుటుంబాలకు ఉచితంగా జిల్లా న్యాయ సేవ ప్రాధికారం నుంచి న్యాయసేవ పొందవచ్చన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక, భిక్షాటన, లైంగిక వేధింపులు వంటి విషయాల్లో బాఽధితులను కాపాడటం మన అందరి కర్తవ్యం అన్నారు. అన్ని పాఠశాలల్లో, చుట్టు పక్కల అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేక పోలీస్ విభాగం సిబ్బంది లలితమ్మ పోలీస్ వివరాలను అందజేశారు. ప్రిన్సిపాల్ మూకప్ప, చెన్నబసప్ప పాటిల్ తదితరులు పాల్గొన్నారు.


