లింగరూపం ఏటేటా వృద్ధి
● రామలింగేశ్వర స్వామి మహిమ
గౌరిబిదనూరు: నగరానికి సమీపంలోని హీరేబిదనూరులో పురాతన రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉద్భవ లింగం ఏటేటా పెరుగుతూ ఉందని భక్తులు, ఆలయ నిర్వాహకులు తెలిపారు. లింగానికి అలంకరించిన ప్రభావళి, ముఖవాడలు ఏడాది గడవగానే సరిపోవడం లేదన్నారు. గతంలో 10 సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ వచ్చామని, ఇప్పుడు ప్రతి ఏటా ప్రభావళిని మార్చాల్సి వస్తోందని తెలిపారు. దేవాలయం ధర్మకర్త ఛత్రం వెంకటాద్రి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ కార్తీకం సందర్భంగా ప్రతి సోమ, శనివారాలు విశేష పూజలు జరుగుతున్నట్లు చెప్పారు. వచ్చే ఆదివారం రాత్రి గిరిజా కళ్యాణోత్సవం సోమవారం స్వామి వారి బ్రహ్మ రథోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.
ఢిల్లీలో పేలుడు..
రాష్ట్రంలో హైఅలర్ట్
బనశంకరి: దేశ రాజధాని ఢిల్లీలో భారీ విస్ఫోటనం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించింది. కర్ణాటకలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ డా.ఎంఏ.సలీం సోమవారం రాత్రి ఆదేశించారు. అన్ని విమానాశ్రయాలు, మెట్రోస్టేషన్లు, మాల్స్, ఐటీ బీటీ కంపెనీలు, ప్రముఖ కార్యాలయాలు, ఓడరేవులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లతో పాటు జన రద్దీ ప్రదేశాల్లో భద్రతను పెంచాలని ఎస్పీలకు ఆదేశించారు. బెంగళూరు నగరంలో గస్తీని ముమ్మరం చేయాలని పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ సూచించారు. అన్ని ఠాణాల పరిధిలో పోలీసులు పహరాను కట్టుదిట్టం చేయాలన్నారు. లాడ్జిల్లో తనిఖీలు చేసి బయటి రాష్ట్రాలకు చెందిన వారిని విచారించాలని, రాత్రి సమయాల్లో భద్రతను పెంచాలని డీసీపీ, ఏసీపీ, సీఐలకు ఆదేశించారు.
చెరకు రైతుల బంద్
యశవంతపుర: చెరకు టన్నుకు రూ.3500 తో పాటు వివిధ డిమాండ్లపై రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలబురగి జిల్లా అఫ్జల్‌పురలో బంద్ జరిగింది. నాలుగైదు రోజుల నుంచి చెరకు రైతులు ఆందోళన చేస్తున్నారు. బంద్‌తో పాటు ర్యాలీని నిర్వహించారు. బెళగావి, విజయపుర, బాగలకోట జిల్లాల్లో సాగిన ఆందోళనలు కలబుర్గి జిల్లాకు వ్యాపించడం గమనార్హం. షాపులు, ఆఫీసులు, పాఠశాలలు మూతపడడంతో బంద్ విజయవంతమైంది. బస్సులు కూడా తిరగలేదు. బంద్‌లో కొందరు ఆకతాయిలు కూరగాయలను అమ్ముతున్న మహిళను దూషించి కాయగూరలను విసిరివేశారు. దీనికి రైతునేతలు క్షమాపణ చెప్పారు.
భార్య వేధింపులు..
బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
యశవంతపుర: పెళ్లయి ఏడాది కూడా కాలేదు, ఎన్నో ఆశలు పెట్టుకున్న వైవాహిక జీవితం చీకటినే మిగిల్చింది. భార్య పెడుతున్న వేధింపులను తట్టుకోలేక భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు గిరినగరలో జరిగింది. గగన్‌రావ్ (29) అనే భర్త ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొన్నాడు. గగన్‌రావ్ ఓ బ్యాంక్‌లో ఉద్యోగి, 8 నెలల క్రితం మేఘన అనే యువతితో వివాహమైంది. పెళ్లి జరిగినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చీటికి మాటికి భార్య మేఘన పేచీలు పెట్టేది. ఈ వేధింపులను తట్టుకోలేక గగన్‌రావ్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని సోదరుడు మేఘనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వన్యమృగాలను
అడ్డుకోండి: సీఎం
మైసూరు: పులుల, ఏనుగులు, చిరుతలు అడవిలో నుంచి వచ్చి ప్రజలు, పశువుల ప్రాణాల్ని తీస్తున్నాయి, ఆ వన్యమృగాలు అడవి నుంచి బయటకు రావడానికి కారణాలు ఏమిటి అనేది శాసీ్త్రయంగా పరిశోధించి, అడ్డుకట్ట వేయాలని సీఎం సిద్దరామయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం మైసూరు జడ్పీలో కెడిపి సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు. అడవులలో ఉన్న నీటి గుంతలను నింపాలని, అడవిలో జంతువులకు ఆహారం లభించేలా చర్యల తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా అటవీ అధికారులు గస్తీని పెంచాలని అన్నారు.
లింగరూపం ఏటేటా వృద్ధి
లింగరూపం ఏటేటా వృద్ధి


