దావణగెరెలో కిరికిరి | - | Sakshi
Sakshi News home page

దావణగెరెలో కిరికిరి

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

శివాజీనగర: ఉప ఎన్నికల వేళ గృహ నిర్మాణ మంత్రి జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ అలిగారు. దావణగెరె దక్షిణలో మైనారిటీ నాయకుడు సాదిక్‌ పైల్వాన్‌కు టికెట్‌ ఇవ్వాలని మంత్రి జమీర్‌ పట్టుబట్టినా అది జరగలేదు. తన కుమారుడు సమర్థ్‌ శ్యామనూరుకు టికెట్‌ రానివ్వకుండా జమీర్‌ అడ్డుపడడంపై మంత్రి ఎస్‌.ఎస్‌.మల్లికార్జున మండిపడి, ఏకవచనంతో విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలతో జమీర్‌ అసంతృప్తికి గురై ఎన్నికల ప్రచారం నుంచి దూరంగా ఉన్నారు. ఆయన ప్రచారానికి రావాలని మైనారిటీ నాయకులు డిమాండ్‌ చేయడం గమనార్హం. ఈ గొడవలతో ఒక వర్గం ఓట్లకు గండి పడుతుందా? అనే ప్రచారం సాగుతోంది.

పైల్వాన్‌ కోసం పట్టు

ఉప ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి దావణగెరె మంత్రి ఎస్‌.ఎస్‌.మల్లికార్జున్‌, జమీర్‌ మధ్య వివాదం రాజుకుంది. కుమారుడు సమర్థ్‌ కోసం మల్లికార్జున, సాదిక్‌ కోసం జమీర్‌ హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి సమర్థ్‌కే టికెట్‌ ఇచ్చారు, కానీ జమీర్‌ దీనిని వ్యతిరేకిస్తూ వచ్చారు. సాదిక్‌ తిరుగుబాటు అభ్యర్థిగా నిలబడడానికి జమీర్‌ కారణమనే మాటలు వినిపించాయి. వీటి మధ్యలో సీఎం సిద్దరామయ్య ప్రచారంలో పాల్గొంటున్నారు. జమీర్‌కు సిద్దరామయ్య నచ్చజెప్పినట్లు సమాచారం. కానీ తమ నియోజకవర్గానికి జమీర్‌ రాకపోవడమే మంచిదని మల్లికార్జున్‌ ప్రకటించడంతో మళ్లీ అలిగారు. ఎక్కడ చూసినా హడావుడి చేసే జమీర్‌ ఎంతో ప్రధానమైన ఉప ఎన్నికల వేళ మౌనంగా ఉండడం ఆశ్చర్యకారకమైంది. కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్లు జమీర్‌ చెప్పారు.

డీకే శివ ఏమన్నారు..?

మంగళవారం దావణగెరెకు వచ్చిన డీసీఎం డీకే శివకుమార్‌కు జమీర్‌ అభిమాని ఆసిఫ్‌ అలీ ఫోటో పట్టుకుని ఎదురుగా నిలబడ్డారు. అతనిని పార్టీ నాయకులు పక్కకు తీసుకెళ్లి బుజ్జగించారు. డీకే మాట్లాడుతూ 79 శాతం ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నారు, మంత్రి జమీర్‌ కేరళలో కాంగ్రెస్‌ స్టార్‌ ప్రచారకునిగా పని చేస్తున్నారు, అక్కడ ముగించుకొని వచ్చిన తరువాత ఎక్కడికి పంపాలనేది చర్చిస్తున్నామని అన్నారు. ఒకరి మీద పార్టీ ఆధారపడదు, అది డీకే, సీఎం, జమీర్‌ ఎవరైనా కావచ్చు అని చెప్పడం గమనార్హం.

కాంగ్రెస్‌ ప్రచారానికి దూరంగా

మంత్రి జమీర్‌ అహ్మద్‌

అభ్యర్థి ఎంపికపై గుర్రు

ఓటర్ల మీద ప్రభావం చూపేనా?

దావణగెరె దక్షిణ, బాగల్‌కోటె అసెంబ్లీ క్షేత్రాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనుండగా రెండుచోట్లా గెలవడం అధికార కాంగ్రెస్‌ పార్టీకి చాలా ముఖ్యంగా మారింది. కానీ పార్టీ నాయకుల మధ్య కలహాలు ముసురుకున్నాయి. మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఇందులో

కేంద్ర బిందువుగా ఉన్నారు.

సిద్దుది తుగ్లక్‌ దర్బార్‌: యడ్డి

శివాజీనగర: ఉప ఎన్నికలలో పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్‌తో పాటుగా ఎవరైనా వచ్చి బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తే స్వాగతిస్తానని పార్టీ నేత బీ.ఎస్‌.యడియూరప్ప తెలిపారు. యత్నాళ్‌ పార్టీ ప్రచారానికి వస్తే ఒప్పుకుంటారా? అని విలేకరులు యడ్డిని ప్రశ్నించగా స్వాగతిస్తానని తెలిపారు. తమకు గెలుపు ముఖ్యమని అన్నారు. 5, 6 తేదీల్లో బాగల్‌కోటలో పార్టీ అభ్యర్థి వీరణ్ణ చరంతిమఠ తరఫున ప్రచారం సాగిస్తానన్నారు. వంద శాతం గెలుస్తామనే నమ్మకముందన్నారు. రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోంది, సీఎం సిద్దరామయ్య ప్రజోపయోగ పనులను మరిచి తుగ్లక్‌ దర్బార్‌ జరుపుతున్నారని ఆరోపించారు. అజీర్ణం అయ్యేవిధంగా కాంగ్రెస్‌కు మెజారిటీ ఉంది, మళ్లీ ఉప ఎన్నికల్లో గెలిస్తే అధికార మదంతో విర్రవీగుతారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో హిందీ భాష తప్పనిసరి కాదనే ప్రభుత్వ తీర్మానాన్ని ఖండిస్తూ, దేశంలో సంచరించాలంటే హిందీ ముఖ్యమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement