● ములాఖత్‌కు డ్రగ్స్ తీసుకెళ్లి
పట్టుబడిన మహిళ
● చిన్నారి కూతురూ చెరసాలకు
బనశంకరి: నగరంలో పరప్పన అగ్రహార జైలులో ఉన్న భర్తకు డ్రగ్స్ ఇవ్వడానికి వెళ్లి పట్టుబడిన మహిళతో పాటు నాలుగేళ్ల పాప కూడా జైలుపాలైంది. తల్లిదండ్రులు చేసిన మూర్ఖపు పనే కారణం. ఆపరేషన్ శుద్ధీకరణ పేరుతో జైలులో అధికారులు సోదాలను తీవ్రం చేశారు. ఖైదీల వద్ద నిషేధిత వస్తువులు ఉండకుండా నిఘా పెట్టారు.
ఏం జరిగింది?
నగరంలో హెణ్ణూరులో ఉండే రితికా రాయ్ (27) అసోం నుంచి వచ్చిన యువతి, హెణ్ణూరువాసి ఫర్హాన్‌ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకుంది. కొన్ని నెలల క్రితం దోపిడీ కేసులో అతడు జైలుకెళ్లాడు. మార్చి 26వ తేదీన ములాఖత్‌కు వెళ్లిన రితికా అతనికి ఇవ్వాలని కొంత డ్రగ్స్, సిమ్‌కార్డులను శరీరంలో దాచుకుని జైలుకు వెళ్లింది. జైలు గేటు వద్ద రితికా రాయ్ ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో మహిళా భద్రతా సిబ్బంది ఆమెను తనిఖీ చేశారు. 3 సిమ్‌కార్డులు, 27 గ్రాముల మెథాంఫెటమైన్ డ్రగ్, బీడీలు, పొగాకు దొరికాయి. ఆ సమయంలో 4 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. రితికా రాయ్‌ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. బయట కుమార్తెను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో తల్లి కోరిక మేరకు ఆమెతో పాటు పాపను జైలులో ఉంచారు. భర్త చెప్పడంతోనే ఈ వస్తువులు తెచ్చానని రితికా రాయ్ తెలిపింది. కాగా ఆమెకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరితో సంబంధాలున్నాయనేది దర్యాప్తు చేపట్టారు.
ఎక్స్‌ప్రెస్ వేలో రెండు కార్లు ఢీ
దొడ్డబళ్లాపురం: బెంగళూరు– మైసూరు ఎక్స్ ప్రెస్ వేపై రెండు కార్లు ఢీకొన్నాయి. చెన్నపట్టణ తాలూకా కోలూరు గ్రామం వద్ద రహదారిపై ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి వే గంగా వచ్చిన మరో కారు ఢీకొంది. దీంతో ముందు వెళ్తున్న కారు పక్క రోడ్డులోకి పల్టీ కొ ట్టింది. రెండు కార్లు మైసూరు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కార్లలోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా చెన్నపట్టణ తాలూకా ఆస్పత్రికి తరలించారు.


